కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధి అగసనూరు గ్రామంలో జగద్గురు రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉత్తరారాధన పురష్కరించుకుని రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి ఆర్ వెంకటేశులు ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పల్లకోత్సవం అనంతరం స్వామివారి పల్లకిని తుంగభద్ర నది వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రహ్లాదరాయలకు వేదపఠనంతో విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి దేవాలయం చేరుకుని రాఘవేంద్రుల మూలబృందావనంలో కొలువు చేశారు. ఉత్సవమూర్తికి పూజారి విశిష్ట పూజలు చేసి వసంతోత్సవానికి శ్రీకారం చుట్టారు. స్వామివారు ఊరేగింపుగా 12 గంటలకు గుడి ముంగిట మహారథం వద్దకు చేరుకున్నారు. ప్రధాన పూజారి రథ చక్రాలకు నారీకేళ సమర్పణలు కావించి ఉత్సవమూర్తికి హారతులు పట్టారు. మహారథంపై ఉత్సవమూర్తిని కొలువుంచారు. సాయంత్రం 5:00 గంటలకు రాఘవుడి మహారథయాత్ర మొదలైంది. అశేష భక్తజనం రాఘవుడి నామస్మరణ అందుకోగా.. కళాకారుల డప్పుదరువులు, హరిదాసుల నృత్యప్రదర్శనలు, మహిళల సంకీర్తనాలాపనలు, బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. స్వామివారి దర్శనం కోసం సాతనూరు, జూకురు, మూగలదోడ్డి, కందుకూరు గ్రామల నుంచి భక్తులు వచ్చి గురువారం రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడి ప్రధాన పూజారి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
అగసనూరులో రాఘవేంద్రస్వామి రథోత్సవం.. రమణీయం..
RELATED ARTICLES