అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మహిళలకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ మహిళలకి సమానమైన హక్కులతో పాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని అందులో భాగంగా గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం, వంటి చట్టాల ద్వారా మహిళలు వారి యొక్క హింసల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎన్నో శాఖల ద్వారా వారికి సహకారం అందిస్తుందని తెలియజేశారు. మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లయితే వారికి 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య, న్యాయం, పోలీస్, కౌన్సిలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పందిర్ల నాగరాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని ప్రభుత్వం మహిళలు రాజకీయంగా ముందుకు రావడానికి స్థానిక ప్రభుత్వాలలో 50 శాతం, విద్యా, ఉద్యోగాల్లో, ఉపాధిలలో 33% రిజర్వేషన్లు కల్పించామని మహిళలు ఆర్థికంగా ముందుండడం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరిత, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, సఖి ఇన్చార్జి విజయ, దేవిక,ఎల్లారెడ్డిపేట మహిళలు పాల్గొన్నారు.