క్రీడా నేపథ్య చిత్రాలు అంటే ప్రేక్షకులకే కాదు హీరోలకూ మోజే. స్పోర్ట్స్ బేస్‌డ్ మూవీస్ చేసి సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరోలు మాత్రం కొద్దిమందే. ఈ ఏడాది టాలీవుడ్‌లో ఈ జానర్‌లో చాలా తక్కువ చిత్రాలే వచ్చాయి. అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
బాక్సర్‌గా మెప్పించని గని
కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడుతూ, వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘గని’ చిత్రం. వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటించారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యారు. బాలీవుడ్ నుంచి సయీ మంజ్రేకర్ కథానాయికగా అరంగేట్రం చేశారు. హాలీవుడ్ స్టంట్‌మాస్టర్లు పనిచేశారు. బాక్సింగ్ రింగ్ కోసం భారీ సెట్లు వేశారు. జగపతిబాబు, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర లాంటి మంచి యాక్టర్స్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ చాలా కష్టపడ్డారు. బాక్సింగ్ లో ప్రత్యేకశిక్షణ తీసుకున్నారు. సిక్స్‌ప్యాక్ చేసి తెరపై కనిపించారు. కానీ ఇవేవీ సినిమాను నిలబెట్టలేకపోయాయి. స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్‌తేజ్ తన పాత్రను అద్భుతంగా పోషించారు. ద్వితీయార్థంలో వచ్చే బాక్సింగ్ మ్యాచ్ హైలెట్‌గా నిలిచింది. కానీ ప్రథమార్థం చాలా నెమ్మదిగా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోవడంతో ‘గని’ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
ఫలితం బ్యాడ్‌లక్
ఈ ఏడాది కథానాయిక ప్రాధాన్య పాత్రలో తెరకెక్కిన క్రీడా నేపథ్య చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో నటించడం, నగేష్ కుకునూర్ తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు. కష్టాలను ఎదుర్కొని ఓ సాధారణ పల్లెటూరి యువతి షూటింగ్ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది అనేది కథ. జీవితంలో పైకెదగడానికి ప్రతిభను నమ్ముకోవాలా, అదృష్టాన్ని నమ్ముకోవాలా అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథను ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యారు. కీర్తిసురేశ్ నటన బాగున్నా సినిమాను నిలబెట్టలేకపోయింది. ఫలితం ‘గుడ్‌లక్ సఖి’చిత్రం కనీసం యావరేజీగా కూడా నిలవలేకపోయింది.
రింగ్‌లో లైగర్ విఫలం
‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీఎఫ్ 2’ తర్వాత హైప్‌తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండకు హీరోగా, పూరీ జగన్నాథ్‌కు దర్శకుడిగా ఇదే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అనన్యాపాండే కథానాయికగా నటించడం, రమ్యకృష్ణ, బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ కీలకపాత్రలు పోషించడం, మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో పూరి శైలి… వెరసి సినిమాపై ఆసక్తిని పెంచాయి. విజయ్ కెరీర్‌లో తొలిసారి మార్షల్ ఆర్ ్ట్స క్రీడాకారుడి పాత్రను పోషించారు. ప్రేమకథకు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ను జోడించి చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ప్రేక్షకులు అంచనా వేసుకున్న స్థాయిలో సినిమా లేదు. పతాక సన్నివేశాల్లో మైక్‌టైసన్‌తో పోరును భారీ స్థాయిలో ఊహించుకుంటే అది కాస్తా నిరుత్సాహపరిచింది. హీరో పాత్ర ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అవ్వలేదు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విజయ్ దేవరకొండ తన బెస్ట్ ఇచ్చినా హీరోగా ఆయన క్రేజ్‌ను తగ్గించిన చిత్రంగా ‘లైగర్’ మిగిలింది.
మోస్తరు ఫలితం మట్టికుస్తీ
‘అరణ్య’, ‘ఎఫ్‌ఐఆర్’ లాంటి చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్నారు విష్ణు విశాల్. ఆయనతో కలసి రవితేజ నిర్మించిన చిత్రం ఇది. చెల్లా అయ్యావు దర్శకుడు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. భార్యాభర్తలు ఇద్దరూ మట్టికుస్తీలో తలపడాల్సి రావడం అనే ఆసక్తికర పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. పూర్తిస్థాయి క్రీడానేపథ్య చిత్రం కాకపోయినా మట్టికుస్తీ ఆట నేపథ్యంలో సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. తెలుగు డబ్బింగ్‌లో లోపాలు ఉన్నా, భార్యభర ్తల గొడవను క్రీడానేపథ్యానికి జోడించి చెప్పిన తీరు ప్రేక్షకులను మెప్పించింది.