న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకులైన జంషెడ్‌జీ టాటా ముని మనవడైన రతన్ టాటా అత్యంత నిరాడంబరుడు, వినయుడు, దయాగుణం కలిగిన పారిశ్రామికవేత్తగా పేరుగాంచారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రతన్.. 1962లో టాటా ఇండస్ట్రీ్‌సలో అసిస్టెంట్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 2012 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ సాధించిన విజయాలు, కీలక మైలురాళ్లు..
- 90వ దశకంలో మొదలైన తొలి దశ ఆర్థిక సంస్కరణల సమయంలోనే రతన్ టాటా గ్రూప్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.
- 1998లో టాటా మోటార్స్ తొలి కారు ‘టాటా ఇండికా’ను విడుదల చేసింది. అప్పట్లో ఈ మోడల్‌కు మార్కెట్లో విశేష ఆదరణ లభించింది.
- 2000 సంవత్సరంలో టాటా గ్లోబల్ బెవరేజెస్ (గతంలో టాటా టీ).. యూకేకు చెందిన తేయాకు కంపెనీ టెట్లీ గ్రూప్‌ను కొనుగోలు చేసింది.
- రతన్ సారథ్యంలోనే జాగ్వార్ లాండ్‌రోవర్, జనరల్ కెమికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, బ్రూనర్ మోండ్, దేవూ బ్రాండ్లను కొనుగోలు చేసింది.
- 2003లో టీసీఎస్ 100 కోట్ల డాలర్ల వార్షికాదాయం సాధించిన తొలి భారత కంపెనీగా రికార్డు సాధించింది. ఆ తర్వాత సంవత్సరంలో టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయింది.
- మధ్యతరగతి వారి సొంత కారు కలను నిజం చేయాలన్న రతన్ టాటా ఆలోచనకు ప్రతిరూపమే టాటా నానో. టాటా మోటార్స్ 2008లో రూ.లక్షకే ఈ కారును అందుబాటులోకి తెచ్చింది.