ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మోండా డివిజన్ లో 4 కోట్ల లక్షా 70వేల రూపాయల వ్యయంతో వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న CC రోడ్ల నిర్మాణ పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కలిసి ప్రారంభించారు. ముందుగా ఓల్డ్ జైల్ ఖానా సమీపంలో 24 లక్షల రూపాయల వ్యయంతో, ఆదయ్య నగర్ కమాన్ వద్ద 65.60 లక్షల వ్యయంతో, టకారా బస్తీలో 80.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు పనులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మోండా మార్కెట్ సర్కిల్ లో కోటి 85 లక్షల రూపాయల వ్యయంతో, సాంబమూర్తి నగర్ లో 46.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిత్యం ఎంతో రద్దీగా ఉండే మోండా మార్కెట్ ప్రాంతం, పేదలు అధికంగా నివసించే కాలనీలు, బస్తీలలో రహదారులు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో దీర్ఘకాలం పాటు ఎంతో నాణ్యతగా ఉండేలా CC రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల మధ్యనే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, మధు, రాములు, సత్యనారాయణ, ప్రమోద్, వెంకటేశం, అమర్ తదితరులు ఉన్నారు.



