సమాజంలో ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే వారు ఇమాములు, మౌజన్ లు. 5 పూటల నమాజ్ నిర్వహించడం, మసీదుల నిర్వహణను పర్యవేక్షించడంతో పాటు సామాజిక విలువలను పెంపొందించడంలో వీరి పాత్ర ఎంతో కీలకమైనది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మసీదులలో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిత్యవసర ధరల దృష్ట్యా వీరికి అందుతున్న గౌరవ వేతనం ఏమాత్రం సరిపోవడం లేదనేది చేదు నిజమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సామజిక ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాన్ని పెంచాలన్నారు ఆవాజ్ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ రహమతుల్లా.
గద్వాలలో నేడు ఆవాజ్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రహమతుల్లా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇమామ్ మరియు మౌజన్ లకు నెలకు రూ. 5000/- గౌరవ భృతి అందజేస్తుందని మసీదులలో నిరంతరం సేవలందించే వీరు, పూర్తిగా దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ధరలు, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ 5000 రూపాయలతో కుటుంబ పోషణం భారంగా మారిందని తక్షణమే తెలంగాణ ప్రభుత్వము ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాన్ని పెంచే విధంగా చొరవ చూపాలని ఆవాజ్ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు.
👉 వేతన పెంపు ఎందుకు అవసరము ?
1) ఆర్థిక భద్రత: సమాజానికి సేవ చేసే వారికి కనీస ఆర్థిక భద్రత కల్పించడం, ప్రభుత్వము మరియు సమాజం బాధ్యత. గౌరవప్రదమైన వేతనం ఉంటేనే వారు మానసిక ప్రశాంతతతో తమ విధులను నిర్వహించగలరు.
2) ధరల పెరుగుదల: గత కొన్నేళ్లుగా గ్యాస్, పెట్రోలు, నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయి. కానీ వేతనాలు మాత్రం మార్పు రాలేదు.
3) సకాలంలో చెల్లింపులు: కేవలం వేతనం పెంపు మాత్రమే కాకుండా, ప్రతి నెల ఒకటో తేదీనే నేరుగా వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలి. బకాయిల సమస్య లేకుండా చూడటం కూడా ఎంతో ముఖ్యం.
💥 పక్కన ఉన్న తెలుగు (AP) రాష్ట్రం ఇమామ్ మరియు మౌజన్ ల గౌరవ భృతి అప్పటికప్పుడు సమీక్షిస్తూ పెంచుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీసం రూ. 15,000/- వరకు వేతనాన్ని పెంచాలని ఆవాజ్ కమిటీ కోరుతుంది.
💥 ఆవాజ్ కమిటీ ప్రధాన డిమాండ్లు :-
1) సమాజానికి దిశా నిర్దేశం చేసే ఈ సేవకులకు కనీసం 15 వేల వరకు గౌరవ వేతనాన్ని పెంచాలి.
2) ప్రతినెల 1 వ తేదీనే నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.
3) పెండింగ్ లొ ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
4) ఇమామ్, మౌజనులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు మరియు ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక సేవకులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని వక్ఫ్ బోర్డు ఆదాయ మార్గాలను మెరుగుపరిచి లేదా బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేయడం ద్వారా ఇమాము, మౌజన్ ల వేతనాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తద్వారా వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తుందని ఆవాజ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు మహమ్మద్ రహమతుల్లా.


