భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు రాజ్యాంగం రాసుకొని 73 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి అభివృద్ధికి నోచుకోని వారెవరైనా ఉన్నారంటే అది ఒక్క ముస్లింలు మాత్రమే. పేరుకు మైనారిటీ హోదా ఉన్నా అనుక్షణం అవమానాలు, అనుమానాలను ఎదుర్కొంటూ సమాజంలో చీదరింపులకు చీత్కారాలకు గురవుతూ మాకిది కావాలి అని అడగలేని నిస్సహాయ స్థితిలో బతుకుతూ ఎన్నికల్లప్పుడు రాజకీయ నాయకులకు, రాజకీయపార్టీలకు ఓటు బ్యాంకుగా గెలుపుకు నిచ్చెనలుగా మారి అవసరం తీరాక పక్కకు తోసేస్తే కనీసం నోరువిప్పలేని అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది ముస్లిం సమాజం. కొందరు ముస్లిం రాజకీయనాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం సాటి ముస్లింలనే తడిగుడ్డతో గొంతుకోస్తున్న ఎవరికీ చెప్పుకోలేని పిరికితనంతో బతుకుతున్నారు. చీకటిలో చిరుదివ్వెలాగా తమ బతుకులకు ఆశాజ్యోతిలా పేద సంచార జాతుల ముస్లింలకు వచ్చిన బీసీ ఈ రిజర్వేషన్లను కూడా రాజకీయం చేసి కోర్టు బోనులో నిలబెడితే అది కాపాడుకునే దారి కనపడక తమను ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే దేవుడే దిక్కని కాలం వెళ్లదీస్తున్నారు. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న కులాల్లో ముస్లింలు దేశంలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని సాక్షాత్తు ప్రభుత్వాలు నియమించిన ఎన్నో కమిటీలు నిర్ధారించిన ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికి బీసీ ఈ కేటగిరీలో ఉన్న 14 తెగల ముస్లింలు బతుకుదెరువు కోసం దేశ దిమ్మరుల్లా తిరుగుతూ ప్రాణాలకు తెగింగి కష్టపడుతున్నారు. జానేడు పొట్టకోసం ప్రాణాపాయం ఉంది తెలిసినా మరోదారి లేక వంశపారంపర్యంగా వచ్చిన కులవృత్తినే నమ్ముకొని బతుకుతున్న గారడీ సాయిబులపై ఇంక్విలాబ్ టీవీ చేస్తున్న నేటి ఈ ప్రత్యేక కధనం వారి దుర్భర దయనీయ జీవితాలకు అద్దం పడుతుంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల్ గ్రామంలో ఉన్న పాములను ఆడించే గారడీ సాయిబులపై నేటి ప్రత్యేక కధనం, ఈ గ్రామంలో ఉండే 56 సంవత్సరాల షేక్ సైదా తనమీద ఆధారపడ్డ కుటుంబ పోషణకై పలుచోట్ల పాములను ఆడిస్తూ ప్రజలకు వినోదం అందించి వారిచ్చే చిల్లర పైసలతో జీవితం గడిపేవాడు. కొద్దీ రోజులక్రితం యధాప్రకారం కులవృత్తితో పొట్టపోషించుకోటానికి ఇంటినుండి వచ్చిన షేక్ సైదాని తన ఇంట్లో పాము దూరిందని దాన్ని పట్టి తన కుటుంబాన్ని రక్షించమని ఓ వ్యక్తి అభ్యర్థిస్తే కాదనలేక ఆ పామును పట్టె క్రమంలో దాని కాటుకు గురై మరణించాడు. తన మీద ఆధారపడ్డ కుటుంబాన్ని దిక్కులేని వారీగా చేసి ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ఇది ఒక్క సైదా విషయంలోనే కాదు కట్రియాల్ లాంటి ఎన్నో గ్రామాల్లో నివసిస్తున్న ఈ గారడీ సాయిబుల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.
టెక్నాలజీ పెరిగి ఎంతో అభివృద్ధి చెందిన నేటి ప్రపంచంలో ఇప్పటికి శతాబ్దాల పురాతన విద్యనే నమ్ముకుని బతుకుతున్నారు వీళ్ళు. చదువుకోవాలని ఉన్న కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వలన చదువుకునే పరిస్థితి లేక చిన్నతనమునుండి ఇదే పనికి అలవాటు పడుతున్నారు వీరి బిడ్డలు. తమ పిల్లలను చదివించి మంచి జీవితాలను ఇవ్వాలనే ఆలోచన ఉన్న తమ సంపాదన సరిపోక తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలకు కూడా ఇదే విద్యను నేర్పిస్తున్నారు. పేరుకు ఎన్నో ప్రభుత్వ పధకాలు ఉన్న ఒక్కటి కూడా వీరికి చేరడం లేదు. బీసీ ఈ రిజర్వేషన్ తో తమ పిల్లలకు ప్రభుత్వం అందించే ఉచిత విద్య నేర్చుకునే అవకాశం కల్పిద్దామన్న ప్రభుత్వాధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వక వేధిస్తుండటంతో ఏ ప్రభుత్వ పధకాన్నీ అందుకునే అవకాశంలేక ఇప్పటికి దుర్భర దారిద్య్రన్ని అనుభవిస్తున్నారు.
ప్రాణాపాయం ఉన్న ఈ గారడీ విద్యలో తమ భర్తలు బిడ్డలు తమ కళ్ళముందే చనిపోతూన్న గుండెల్లో బాధని కళ్ళల్లో కన్నీటిని దాచుకొని బతుకుతున్నారు ఇక్కడి మహిళలు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి తమ బతుకులను బాగు చెయ్యాలని తమ కులవృత్తిలో ప్రాణహాని ఉంది కాబట్టి వేరే ఏదైనా స్వయం ఉపాధి పొందేందుకు తగిన సహాయం అందించాలని, ఇప్పటిలో తమకు స్థిర నివాసం లేదని ప్రభుత్వం స్పందించి తమకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని, ప్రభుత్వ అధికారులు స్పందించి తమ పిల్లల చదువులకు, ఉద్యోగ ఉపాధి కొరకు అవకాశం కల్పించే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చెయ్యాలని కోరుతున్న ఈ అభాగ్యుల ఆర్తనాదాలు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికైనా చేరతాయని వారికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం