రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు శాఖలో కొత్తగా మూడు చీఫ్ ఇంజనీర్ (సీఈ), 10 సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ), 13 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పోస్టులు భర్తీ కానున్నాయి. వీటితో పాటు కొత్తగా 10 సర్కిళ్లు, 13 డివిజన్లు, 124 సెక్షన్లు, 79 కొత్త సబ్ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అంతేకాక, కొన్ని డివిజన్లకు, సర్కిళ్లకు స్థానచలనం కలగనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి జారీ చేశారు. దీంతో పోస్టింగ్‌లపై అధికారులు దృష్టి సారించారు. కాగా, కొత్తగా ఏర్పాటు కానున్న మూడు సీఈ కార్యాలయాల్లో రెండు టెరిటెరోయిల్, ఒకటి ఎలక్ట్రికల్ విభాగం కింద ఉండనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి, యాదాద్రి, వరంగల్(ఎలక్ట్రికల్), నిజామాబాద్(జాతీయ రహదారుల)లో కొత్తగా సర్కిల్ ఆఫీసులు ఏర్పాటు కానున్నాయి. ఒక సర్కిల్‌కు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. వరంగల్‌లో ఉన్న జాతీయ రహదారుల విభాగం సర్కిల్ ఆఫీస్ వేరే దగ్గరకు మారనుంది. ఈ కొత్త సర్కిళ్లు, డివిజన్ల సరిహద్దులను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆర్ అండ్ బీలో కొత్తగా ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు, 10 సర్కిళ్లకు ఎస్‌ఈలు, 13 డివిజన్లకు 13మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 79సబ్‌డివిజన్లకు డిప్యూటీ ఇంజనీర్లు, 124 సెక్షన్లకు జూనియర్ ఇంజనీర్లు రానున్నారు.