కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లినా జన సందోహంతో కలిసిపోయి, ఆడుతూ, పాడుతూ కనిపిస్తూ ఉంటారు. వారికి స్వాగతం పలికేందుకు వచ్చే నృత్యకారులు, గాయనీగాయకులతో కలిసి నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, వారితో మమేకమవుతూ ఉంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అదే బాటలో నడవడం ప్రారంభించారు. ఝార్‌గ్రామ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పెద్ద డోలు వాయించి, అందరినీ అలరించారు.
గిరిజన స్వాతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకల కార్యక్రమంలో మమత బెనర్జీ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యకారులతో కలిసి, ఆమె నృత్యం చేశారు. పెద్ద డోలును కాసేపు వాయించారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన వస్తు, సేవల పన్ను బకాయిలు, వివిధ కేంద్ర పథకాల నిధులను ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు. 100 రోజుల ఉపాథి హామీ పథకం నిధులు తప్పనిసరిగా ఇవ్వవలసి ఉందని, ఈ నిధులను మంజూరు చేయాలని తాను ఏడాది క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని స్వయంగా కోరానని చెప్పారు. ఇంతకంటే ఏమి చేయాలి? నేను మీ పాదాలపై పడి బిచ్చమడగాలా? అని ప్రధానిని నిలదీశారు. ”మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక భారతదేశం ఏక పార్టీ దేశంగా మారిందా? అని ప్రశ్నించారు.