సావోపాలో: దివంగత బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ పీలే తన యావదాస్తిలో 30 శాతం తన మూడో, ఆఖరి భార్య మర్సియా సిబీలి అవోకికి చెందేటట్టుగా వీలునామా రాశాడు. మిగతా ఇద్దరు భార్యలతో ఎప్పుడో విడిపోయిన పీలే.. 2016లో మర్సియాను పెళ్లి. చేసుకున్నాడు. పీలే కడశ్వాస దాకా మర్సియా అతని వెన్నంటే ఉండి సపర్యలు చేసింది. వీలునామా ప్రకారం పీలే నివసించిన భవనం, రిసార్టులకు మర్సియా వారసురాలు కాగా.. మిగిలిన 70 శాతం ఆస్తి అతని సంతానానికి దక్కనుంది. పీలేకు ఏడుగురు పిల్లలున్నారు. అయితే, ప్రపంచానికి తెలియని మరో కుమార్తె గురించి కూడా పీలే తన వీలునామాలో ప్రస్తావించాడట. దీంతో డెభ్బై శాతం ఆస్తిని 8 మంది పిల్లలు పంచుకోనున్నారు. పీలే గత డిసెంబరులో క్యాన్సర్‌తో మరణించాడు.