కాకినాడ జిల్లా పెద్దాపురంలోని అంబటి ఆయిల్ కంపెనీలో ఈనెల 9న జరిగిన దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందడానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని తేలింది. సంస్థ ఘోర తప్పిదంతోనే వీరంతా చనిపోయారని ప్రమాద ఘటనపై నియమించిన ఉన్నతాధికారుల బృందం తేల్చిచెప్పింది. ఈ మేరకు 13 పేజీల నివేదిక కాపీ ‘ఇంక్విలాబ్ టీవీ’ చేతికి చిక్కింది. అనుభవం లేని కార్మికులను నూనె ట్యాంకులోకి దించడంతోనే ఊపిరి ఆడక వారంతా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారని అధికారుల కమిటీ పేర్కొంది. అసలు ఆయిల్ ప్యాకింగ్ యూనిట్‌కు కర్మాగారాల శాఖ నుంచి అనుమతులే లేవని నిగ్గు తేల్చింది.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాకియా ఆధ్వర్యంలో కమిటీ ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందో తమ నివేదికలో వివరించింది. ఈ నెల 9న ఫ్యాక్టరీలోని ఐదో నంబరు నూనె ట్యాంకును శుద్ధి చేయడానికి కిరణ్, సాగర్ అనే ఇద్దరు కార్మికులు కిందకు దిగారు. వీరిద్దరూ నూనె మడ్డిలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా విషవాయువులు విడుదలవడంతో ఊపిరి పీల్చుకోలేకపోయారు. దీంతో ట్యాంకులోని స్టీల్ నిచ్చెన ద్వారా పైకి ఎక్కడానికి ప్రయత్నించగా మధ్యలో పట్టుతప్పి ఒకరు మడ్డిలో పడిపోయారు.
అతన్ని కాపాడేందుకు మరొక వ్యక్తి కూడా మడ్డిలోకి దిగగా.. ఇద్దరూ చనిపోయారు. అయితే వారిని కాపాడేందుకు బయట ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు ట్యాంకులో దిగి ఊపిరాడక చనిపోయారని.. ఇలా ఏడుగురు కార్మికులు కన్నుమూశారని కమిటీ తన నివేదికలో విశ్లేషించింది. కాగా ప్రమాద ఘటన నేపథ్యంలో కంపెనీ యజమానులు సింగవరపు విశ్వనాథ్, సింగవరకు రఘురాంలతోపాటు ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ అక్కిరెడ్డి శ్రీనివా్‌సలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు.