ఆధారాలు, సాక్ష్యాలు లేకపోయినా తనపై కేసు నమోదు చేసి గత పదహారేళ్లుగా వేధిస్తున్నారని, కర్ణాటకలో కొనసాగుతున్న ఈ కేసును ఉపసంహరించాలని ప్రజా గాయకుడు గద్దర్.. బుధవారం రాష్ట్రపతి ముర్ముకు విన్నవించారు. ఈ మేరకు రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు తనను దూతగా నియమించిందని, ఆ సమయంలో కర్ణాటకలోని తుంకూరు జిల్లా పావ్‌గాడ తాలుకాలోని తిరుమణి పోలీసుస్టేషన్‌లో ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసులు నమోదు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. తనపై ఎలాంటి సమన్లు లేవని, వారెంట్ జారీ కాకపోయినా అక్కడి 2వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసును కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా గాయకుడిగా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, అయినా తాను పరారీలో ఉన్నట్టుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.