అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోపై తెలుగు దేశం సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘‘వైఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని సీఎం జగన్ చాపర్లు ఎక్కటం మానేశారా? రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రోడ్డెక్కకుండా అడ్డుకుంటారా? నేరాంధ్ర ప్రదేశ్‌గా ముద్ర పడిన ఏపీలో పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? కేవలం చంద్రబాబు, తెలుగుదేశం సభల్ని అడ్డుకునేందుకు మాత్రమే చీకటి జీవో తెచ్చారoటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతోంది. నారా లోకేష్ యువగళం అడ్డుకునేందుకే ఈ చీకటి జీవో తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని హరిస్తున్నారు.’’ అని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నక్కా ఆనందబాబు..
‘‘దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని బహిరంగ సభలో హత్య చేస్తే కేంద్రం బహిరంగ సభలు నిషేధించిందా? మరో ప్రధాని ఇందిరాగాంధీని సొంత భద్రతా సిబ్బంది చంపేస్తే.. నాయకులంతా భద్రత విరమించుకున్నారా? ఏదైనా సంఘటన జరిగితే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి కానీ పర్యటనలు అడ్డుకుంటామనడంమేంటి?. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఏపీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం సిగ్గుమాలిన చర్య. జగన్‌ను తరిమి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్వాతంత్రం కోసం పోరాడిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఇటువంటి ఆంక్షలు పెట్టలేదు. చీకటి జీవోలతో ప్రజాస్వామ్య హక్కుల్ని అడ్డుకోలేరు. ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదు.’’ అని ప్రభుత్వాన్ని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.