ఏపీలో పాలన నలుగురు రెడ్ల చేతుల్లోనే సాగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. 12 మంది సీనియర్ ఐపీసీ అధికారులను కాదని డీజీపీగా కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదే జిల్లాకు చెందిన జవహర్ రెడ్డిని నియమించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పులివెందులకు చెందిన మరో ఐఏఎస్ అధికారి కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. ఇలా సీఎం జగన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. కులం, మతం చూడమని చెప్పిన సీఎం తన కులాన్ని మాత్రమే చూస్తారని ఎద్దేవా చేశారు. ఇక, పార్టీ పరంగా నియమించిన కో ఆర్డినేటర్లలో 90ు మంది సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పేరుకే బీసీ ఉపముఖ్యమంత్రులను నియమించిన జగన్ వారికి కనీస బాధ్యతలను కూడా అప్పగించలేదని విమర్శించారు. ఏసుక్రీస్తు సందేశాలతో కూడిన ఆటోచార్జి రసీదులను ప్రయాణికులకు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడిన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించడం సహేతుకంగా లేదన్నారు. ఈ బదిలీ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసినట్టు తెలిపారు.
లోకేశ్‌పైనా కేసులు పెడతారేమో!
‘‘రూల్స్ కమిటీ నుంచి నన్ను తొలగించడం కాదు. త్వరలోనే మీ పదవులు పోతాయి’’ అని రఘురామ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. లోక్ సభ రూల్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న తనని తొలగించాలని తమ పార్టీకి చెందిన ఒక రెడ్డి నేత కమిటీకి లేఖ రాశారని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర నిర్ణయం అవసరం, అభినందనీయమని తెలిపారు. లోకేశ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధించే అవకాశం లేకపోలేదని అన్నారు.