న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై సీఎం కేజ్రీవాల్ కుట్ర చేస్తున్నారా అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రశ్నించారు. మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన సిసోడియాను కరడుగట్టిన నేరగాళ్లకు ఉద్దేశించిన తిహాడ్ కాంప్లెక్స్‌లోని ఒకటో నంబరు జైలులో ఉంచడంపై ఆప్ అభ్యంతరం తెలిపింది. సిసోడియాను హత్య చేయడానికే ఆ జైలులో ఉంచారని ఆరోపించింది. దీనిపై మనోజ్ తివారీ స్పందిస్తూ ఢిల్లీ జైళ్లు సీఎం కేజ్రీవాల్ ఆధీనంలోనే ఉంటాయని, అలాంటప్పుడు హత్య చేయడానికి అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ రహస్యాలన్నీ సిసోడియాకు తెలుసని, అందుకే ఆయనే ఏమైనా హత్య చేయించడానికి కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఆరోపణలను జైలు అధికారులు ఖండించారు. సిసోడియాను సీజే-1 వార్డులో ఉంచామని తెలిపారు. అక్కడ సత్ప్రవర్తన ఉన్నవారే తప్ప గ్యాంగ్‌స్టర్లు ఎవరూ లేరన్నారు.