శాన్‌ఫ్రాన్సిస్కో: ఆర్థిక మాంద్యం (Recession 2023) తాలూకా ప్రతికూల ఫలితాలు మెల్లిమెల్లిగా ఒక్కో రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం టెక్ కంపెనీల లే-ఆఫ్స్ ట్రెండ్ (Tech Layoffs) నడుస్తోంది. ఒక్క మెయిల్‌తో ఉన్న పళంగా ఉద్యోగులను ఇంటికి పంపించేసి పలు ఐటీ సంస్థలు (IT Layoffs) వ్యయ భారాన్ని తగ్గించుకునే దిశగా ముందుకెళుతున్నాయి. అయితే.. ఉద్యోగులను తొలగించే విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో కారణాన్ని సాకుగా చూపుతుండటం గమనార్హం. మూన్‌లైటింగ్ అని ఒక సంస్థ, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ బ్యాచ్ ఏరివేత అని మరో సంస్థ.. కాస్ట్ కటింగ్ అని మరో సంస్థ ఇలా ఒక్కో ఐటీ కంపెనీ ఒక్కో కారణాన్ని బూచీగా చూపించి ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్న పరిస్థితి. అయితే.. ఈ లే-ఆఫ్స్ కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు.
తాజాగా.. మీడియా రంగానికి కూడా మాంద్యం సెగ తగిలింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగాలకు కూడా ముప్పు వచ్చి పడింది. వ్యాపార ప్రకటనలు ఆశించిన స్థాయిలో రాకపోవడం, వ్యాపార సంస్థలు కూడా వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రకటనలు ఇచ్చేందుకు అంతగా ముందుకు వస్తుండకపోవడంతో మీడియా రంగంపై కూడా మాంద్యం దెబ్బ పడింది. Axios అనే అమెరికన్ న్యూస్ వెబ్‌సైట్ ప్రకారం.. మీడియా రంగంలో అక్టోబర్ నాటికి 3,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు.
అమెరికాకు చెందిన అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ అయిన Warner Bros Discovery కూడా లే-ఆఫ్స్ బాటను ఎంచుకున్నట్లు తెలిసింది. CNN చీఫ్ క్రిస్ లిచ్ట్ వచ్చే నెల నుంచి లే-ఆఫ్స్ ఉంటాయని ఉద్యోగులను హెచ్చరించినట్లు Axios పేర్కొంది. అంతేకాదు.. కాస్ట్ కటింగ్ ప్రక్రియలో భాగంగా Paramount Global మొదలుకుని The Walt Disney Company వరకూ లే-ఆఫ్స్ దిశగా ముందుకెళుతున్నట్లు సమాచారం. గత నెలలోనే Comcast’s Cable Unit కొందరు ఉద్యోగులను ఇంటికి పంపించేసిందని తెలిసింది. ఈ సంస్థకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ వింగ్ అయిన NBCUniversal కూడా త్వరలో లే-ఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. టెక్ న్యూస్ వెబ్‌సైట్ అయిన Protocol ఈ సంవత్సరం ముగిసే సరికి దాదాపుగా మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. Axios కథనం ప్రకారం.. ఈ వెబ్‌సైట్‌లో పనిచేస్తున్న 60 మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోనున్నారు. Vice Media CEO న్యాన్సీ డ్యుబక్ కూడా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల్లో 15 శాతం వరకూ కోతలు తప్పవని స్పష్టం చేసినట్లు తెలిసింది.