స్టూవర్టుపురం దొంగల ముఠాతో సంబంధాలు నెరపుతున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ వ్యవహారంలో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనికి ఒకరిద్దరు అధికారుల అండదండలున్నట్లు తేలింది. హైదరాబాద్‌లో కీలకమైన ఎస్సార్‌నగర్, గాంధీనగర్ ఠాణాల్లో పనిచేసి.. ప్రస్తుతం పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ విభాగంలో సేవలందిస్తున్న ఆ దొంగ కానిస్టేబుల్ ఈశ్వర్‌ను నల్లగొండ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఇతని వృత్తి పోలీసే అయినా.. ప్రవృత్తి దొంగతనాలని, కరడుగట్టిన స్టూవర్టుపురం దొంగల ముఠాలో సభ్యుడని గుర్తించారు. ఈశ్వర్ రూ. కోట్లలో ఆస్తిని కూడబెట్టినట్లు నిర్ధారించారు. ఓ సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్టు సందర్భంగా.. ఈశ్వర్ పట్టుబడ్డాడు. తదుపరి దర్యాప్తులో ఈశ్వర్ ఆయా ముఠాలకు వెన్నుదన్నుగా ఉంటూ.. చోరీలు చేయిస్తున్నట్లు తేల్చారు. అతను చేయించిన దొంగతనాల చిట్టాను సేకరించారు. ఈశ్వర్‌కు కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు అండగా నిలిచినట్లు నిర్ధారించారు. ఈ తతంగంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నివేదిక తెప్పించుకున్నారు. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ ప్రారంభించిన స్పెషల్‌బ్రాంచ్(ఎ్‌సబీ) అధికారులు.. దొంగపోలీసు చేయించే దొంగతనాల్లో ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల పాత్ర ఉన్నట్లు నిగ్గుతేల్చారు. వీరిలో ఒక ఇన్‌స్పెక్టర్ ఇప్పటికే సైబరాబాద్‌కు బదిలీ అయ్యారు. అక్కడ వెయిటింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. మరొక ఇన్‌స్పెక్టర్ హైదరాబాద్ సీపీ కార్యాలయంలోనే ఓ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఇద్దరు ఎస్సైల పాత్రను కూడా ఎస్‌బీ అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. వారిపై సీపీ నేడో రేపో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.