హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ స్పష్టతనిచ్చారు. ఎన్నికలకు ఏడాది కాలం ఉందని గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు. రానున్న 10 నెలలు చాలా కీలకమని, టీఆర్‌ఎస్ నేతలంతా ప్రజల్లో ఉండాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించారు.
ఇకపై బీజేపీ మరింత రెచ్చిపోతుందని, ఆ పార్టీతో ఇక యుద్ధమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని నాయకులకు కేసీఆర్ సూచించారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దని స్పష్టం చేశారు. ఐటీ, సీబీఐ, ఈడీలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడంతో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రచారం జరిగింది. ఏడాది ముందే ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమౌతారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ఊహాగానాలకు, పుకార్లకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఏడాది తర్వాతే, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 85వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేవలం 10వేల మెజార్టీతో గెలవడంతో… తమకు మెజార్టీ ఇంత స్థాయిలో తగ్గుతుందని ఊహించలేకపోయామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఫలితాలు వెలువడిన రోజే ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని రుజువైంది. దీంతో రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నువ్వా నేనా అనే వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు.