చిత్తూరు: ‘నా పాదయాత్రను అడ్డుకోవడానికి, నా నుంచి మైకు లాక్కోవడానికి పోలీసులకు టార్గెట్లు విధించారు. ఆదేశాలు వచ్చిన వెంటనే మైకు లాక్కోకుంటే పోలీసులకు నోటీసులు కూడా ఇస్తున్నారు. అసలు నేనంటే ఎందుకంత భయం జగన్‌రెడ్డీ’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర 17వ రోజు ఆదివారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో సాగింది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర 17 రోజులు జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి తిరుపతి జిల్లాలోని పుత్తూరు మండలం చినరాజకుప్పంలోకి ప్రవేశించింది. ఆదివారం కూడా లోకేశ్ మైకులో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల కోరిక మేరకు ఆయన స్టూల్‌పైకి ఎక్కి మైకు లేకుండానే మాట్లాడారు. ‘‘నా చుట్టూ నిత్యం వందల మంది పోలీసులు ఉంటున్నారు. నా మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసి నిత్యం రికార్డు చేస్తున్నారు. నేనంటే జగన్‌రెడ్డికి అంత భయం ఎందుకో అర్థం కావడం లేదు. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు.. ఇలా అన్నివర్గాల వారితో పాటు పోలీసులు కూడా జగన్‌రెడ్డి బాధితులే. పోలీసులకూ 8 డీఏలు ఇవ్వాల్సి ఉంది. జగన్ అడుగడుగునా మోసాలే చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో మళ్లీ ప్రజల ముందుకు వస్తాడు. ముద్దులు పెడతాడు. కిలో బంగారం ఇస్తానంటాడు. ఈసారి ప్రజలు మోసపోరు’’ అని అన్నారు.
అడ్డుకున్నా పోరాడతా..
‘నేను మీతో మాట్లాడుతుంటే పోలీసులు డ్రోన్ కెమెరాతో ఎలా షూట్ చేస్తున్నారో చూడండి’ అంటూ లోకేశ్ తన పైన ఉన్న పోలీసుల డ్రోన్‌ను ప్రజలకు చూపించారు. దీంతో వారు గట్టిగా కేకలు వేశారు. ‘‘మనపై నిఘా వేసే ఈ పోలీసులు దొంగల్ని పట్టుకోలేరు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టలేరు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని పట్టుకోలేరు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని మాత్రం అరెస్టు చేస్తారు. ఇప్పటికే నాపై 20 కేసులు పెట్టారు. 400 రోజుల పాదయాత్రకు 400 కేసులు పెడతారు. పెట్టుకోనివ్వండి. మైకు ఇవ్వకపోయినా మాట్లాడతా. అడ్డుకున్నా పోరాడతా. పరదాలకు దండం పెట్టే ప్యాలెస్ పిల్లిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’’ అని లోకేశ్ అన్నారు.
నారాయణస్వామి సొంతూరులో భారీ స్వాగతం
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంతూరైన చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురంలో లోకేశ్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో లోకేశ్ స్టూల్‌పైకి ఎక్కి మైకు లేకుండానే మాట్లాడారు. ‘‘డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి జాడల్లేవు. ఆయన్ను అడిగితే, జగన్ పేపర్, పెన్ను ఇచ్చి ఇంకు ఇవ్వలేదంటారు’’ అని అన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, జీడీనెల్లూరు సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు, మీడియా కోఆర్డినేటర్లు బీవీరాముడు, శ్రీధర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
తల్లిని అవమానించినా..
‘‘నా తల్లిని జగన్ అవమానించినా.. నేను ఏ రోజు కూడా విజయమ్మ, భారతి, షర్మిలను అవమానించలేదు. చంద్రబాబును నరికేయండని జగన్ మాట్లాడినట్టుగా నేను అనలేదు. పాదయాత్రలో జగన్ హామీలను ప్రజలకు గుర్తు చేస్తున్నా. ప్రశ్నిస్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాననే నా నుంచి మైకు లాగేస్తున్నారు’’ అని లోకేశ్ అన్నారు.
పాదయాత్ర సాగిందిలా..
17వ రోజు ఆదివారం మధ్యాహ్నం కార్వేటినగరం మండలంలోని కొత్తూరు శిబిరం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. శనివారం ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ శిబిరానికి వచ్చారు. వారిద్దరినీ చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. ఆదివారం పాదయాత్ర ప్రారంభమైన 20 నిమిషాలకు వారు బయల్దేరి వెళ్లిపోయారు.
టీటీకండ్రిగ వద్ద ఆటోలో వెళ్తున్న డ్రైవర్ శివను లోకేశ్ పలకరించి, డీజిల్ ధరల గురించి అడిగారు. లీటరు డీజిల్ ధర రూ.95 అని డ్రైవర్ శివ చెప్పడంతో.. లోకేశ్ ఆశ్చర్యంగా ‘అంత తక్కువకు ఎలా ఇస్తున్నారు’ అని అడిగారు. తమది సరిహద్దు గ్రామం కావడంతో తమిళనాడు పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకొంటానని శివ బదులిచ్చారు. ఈడిగపల్లె వద్ద గౌడ కులస్తులు, కృష్ణాపురం క్రాస్ వద్ద ముస్లిం సోదరులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలను అందించారు. 17వ రోజు పాదయాత్రలో లోకేశ్ 17.9 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇంత ఎక్కువ దూరం నడవడం ఇదే తొలిసారి. 17 రోజుల్లో మొత్తం 219.1 కిలోమీటర్లు నడిచారు.
3 వేల ఎకరాలపై నారాయణస్వామి కన్ను
జీడీనెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్వగ్రామమైన డీఎంపురం గ్రామస్తులు ఈరోజు నన్ను కలిశారు. తమకు జీవనాధారమైన అటవీ భూమిని మంత్రి నారాయణస్వామి ఆక్రమించాలని చూస్తున్నారని వాపోయారు. నారాయణస్వామి ఇప్పటి వరకూ జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డిలకు తొత్తు అని మాత్రమే నాకు తెలుసు. జగన్ అద్దె మైకుగా మారి మాపై విరుచుకుపడే స్వామి అమాయకుడు కాదని, వేల ఎకరాలపై కన్నేసిన భూబకాసురుడని, మేకవన్నె పులి అని ఆయన సొంతూరి ప్రజలే చెప్పింది విని నివ్వెరపోయాను. దీనికి ఏం సమాధానం చెబుతావు స్వామీజీ?