జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంబంపల్లి – పాసిగామ గ్రామాల వద్ద చారిత్రాత్మక స్థలంలో ఇథనాల్ ఫాక్టరీ కట్టాలని చూడడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరాం విమర్శించారు. సోమవారం ఆయన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి నేతృత్వంలో పాసిగామ – స్థంభంపల్లి గ్రామాల ప్రజలను కలిసి వారి ఆవేదన, ఇథనాల్ ఫాక్టరీ వద్దని అడ్డుకునేందుకు చేస్తున్న పోరాటాల ను అడిగి తెలుసుకున్నారు. ఇథనాల్ ఫాక్టరీ నిర్మాణం తో ప్రజలకు కలిగే కష్ట – నష్టాల గురించి చర్చించారు. రెండు గ్రామాల ప్రజలను కలిసి మాట్లాడారు. ఫాక్టరీ నిర్మాణ స్థలాలను, పురాతన చారిత్రాత్మక స్థలాలను, అక్కడ ఉన్న పలు రకాల ఆనవాళ్లను స్వయంగా తిరిగి పరిశీలించారు.
ఈప్రాంత గుట్ట బుద్దుడు నడియాడిన నేల అని ఇక్కడ బౌద్ధ సమాదులో దానికి నిదర్శనమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అద్యక్షులు ప్రొ.కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్న పాశిగామ, స్థంబంపల్లి గ్రామాల దగ్గర గల స్థలాన్ని, చారిత్రాత్మకమైన బౌద్ద సమాదులను పాశిగామ గ్రామస్తులతో కలిసి పరీశీలించడం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ పాశిగామ గుట్టలు ఒకప్పుడు బౌద్దులు తిరిగిన ప్రాంతం అని ఇక్కడి సమాదులతో పాటు ఇతర బౌద్ద ఆనవాళ్లే నిదర్శనం అన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో చారిత్రత్మకమైన బౌద్ద అనవాళ్లు కనుమరుగవుతాయని తెలిపారు. పచ్చని పంటలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చేందుకే ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. ప్రజల ప్రాణాలను హరించి ఫ్యాక్టరీని ఎవరు కోరుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఈప్రాంత ప్రజలకు న్యాయం జరిగి ఫాక్టరీ నిర్మాణం నిలిచిపోయేంత వరకు పోరాటం చేస్తామన్నారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం,మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా చితకబాదడం బాధాకరం అన్నారు. ఇకనైనా పోలీసులు, ఉన్నతాధికారులు ఈ దుర్మార్గపు చర్యలను, ప్రజలను హింసించడం, తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని కోరారు. లేనిపక్షంలో తగిన విధంగా ప్రజలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించాల్సి వస్తదని కోదండరాం హెచ్చరించారు.
స్థంభంపల్లి, పాసిగామ గ్రామాల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల వల్ల తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. వడ్లు కొనుగోలు చేస్తామని కొబ్బరికాయలు కొట్టి నెల రోజులైనా ఒక్క గింజ కూడా జోకక పోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, దళిత లిబరేషన్ ఫ్రాంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడీ సుదర్శన్ లు ఇథనాల్ ఫాక్టరీ వల్ల కలిగే నష్టాలు, ఫాక్టరీ నిలిపివేసేందుకు చేయబోయే ఉద్యమ కార్యాచరణ గూర్చి మాట్లాడారు. జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తరుణ్, నాయకులు నంద గోపాల్, చిట్యాల రాజేందర్, వన్నెల శశి, గౌరి శంకర్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. స్థంభంపల్లి ఎంపిటిసి పొడేటి సతీష్, పాసిగామ సర్పంచ్ బొప్పు తిరుపతి, ఆయా గ్రామాల నాయకులు, యువత మహిళలు, ప్రజలు ప్రొ. కోదండరాం కు ఇథనాల్ ఫాక్టరీ వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వ, ఈప్రాంత ప్రజాప్రతినిధుల వైఖరి, పోలీసులు పెడుతున్న ఇబ్బందులు, లాఠీచార్జి తదితర విషయాలను వివరించారు.