అమరావతి: మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినప్పటికీ వారిపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. ప్రతీరోజు ఏదో చోట కామాంధుల ఆకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ప్రతిఘంటించిన మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. వికలాంగుల పట్ల కనీసం జాలి దయా చూపించకుండా… ఆడపిల్ల అయితే చాలు అనే దుర్మార్గపు ఆలోచనతో కామాంధులు రెచ్చిపోతున్నారు. వీరికి మద్యం, గంజాయి తోడైతే వారు మనషులన్న విషయాన్ని మరిచి మహిళల పట్ల క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే అమరావతిలో చోటు చేసుకుంది. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో అమానుషం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి పట్ల రాజు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని యువతి తన అమ్మకి, పెద్దమ్మకు తెలిపింది. దీంతో రాజును యువతి తల్లి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాణిపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. గంజాయి తీసుకున్న రాజు ఆ మత్తులో రాణిని తలపై అనేకమార్లు కత్తితో నరికాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే రాణి ప్రాణాలు కోల్పోయింది. కళ్లు కనిపించని తమ బిడ్డని చంపిన రాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు. సమాచారం అందిన వెంటే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.