న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలను తమ మీదకు ఉసిగొల్పుతున్నారంటూ ప్రధాని మోదీకి ప్రతిపక్ష నాయకులు లేఖ రాయడంపై బీజేపీ స్పందించింది. లేఖలు రాసిన నేతల రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఢిల్లీలో ఎంపీ మనోజ్ తివారీ, బెంగాల్‌లో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బిహార్‌లో రాష్ట్ర చీఫ్ సంజయ్ జైశ్వాల్, యూపీలో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ మీడియా ముందుకు వచ్చారు. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, కశ్మీర్‌లలోనూ బీజేపీ నాయకులు మాట్లాడారు.
మహారాష్ట్రలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు నేపథ్యంలో.. తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ సీఎం కేసీఆర్, మాన్, కేజ్రీవాల్, మమత సహా ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్, తేజస్వీ యాదవ్ ఆదివారం ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేరళ సీఎం పినరాయి విజయన్ సొంతంగా లేఖ పంపారు. కేంద్ర సంస్థల దుర్వినియోగం ప్రమాదకరమని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదంటూ పలు ఆరోపణలు చేశారు. వీటికి సమాధానంగానే బీజేపీ ఒకే రోజు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో మీడియా సమావేశాలు నిర్వహించింది.