రాష్ట్రాన్ని జిత్తుల మారి నక్కగా పరిపాలించి, రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి అయన మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కరీంనగర్ పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో మాట్లాడిన తీరు చూస్తే అధికారం కోల్పోయి ప్రస్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు వారి పరిపాలన పక్కనపెట్టి ప్రజా పాలనకు అవకాశం ఇచ్చారని దాన్ని చూసి ఓర్చుకోలేక, ఇష్టానుసారం వారు మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్నారని ప్రతిపక్ష నేతగా నేడు పంటలు దెబ్బతిన్నదాన్ని పరిశీలించడానికి రావడానికి చూస్తే గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఆయన పరిపాలించిన ఆయన అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. ఆనాడు రాష్ట్రంలో ఖమ్మం రైతులకు బిడీలు వేసిన ఘనత, వరంగల్ మిర్చి రైతులపై లాఠీచార్జ్ చేసిన ఘనత కేవలం కేసీఆర్ కి దక్కుతుందని, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని జీవోను తీసి రైతులకు అణా పైసా ఇవ్వని నువ్వా రైతుల పక్షాన మాట్లాడేది అని ప్రశ్నించారు.
వడగళ్ల వాన వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పదివేల ఎకరాలకు నష్టం వాటిల్తే ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని అన్నారు. దీక్షలు ధర్నాలు చేయకుండా ధర్నా చౌక్ ఎత్తేసిన నాయకుడు నేడు దీక్ష చేయడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో నిర్భందించి నాయకులను గృహ నిర్బంధంలో ఉంచిన నీవు నేడు రైతుల గురించి దీక్ష చేస్తున్నావ అని ఎద్దేవా చేశారు.
ప్రజలకు సన్న రకాలు వేయమని చెప్పి నీ ఫామ్ హౌస్ లో దొడ్డురకం పండించి, ఆనాడు వరి వేస్తే ఊరి అన్న నీవా రైతుల గురించి మాట్లాడేది, కేసీఅర్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నామని ప్రజలు ఆల్రెడీ కెసిఆర్ ప్రభుత్వాన్ని పండబెట్టి తొక్కిన ఇంకా బుద్ధి రావడం లేదా అని ప్రశ్నించారు. రైతులను పదేళ్లుగా మోసం బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని, రైతును రాజు చేసింది, చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని తెలిసి కేసీఆర్ నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, గత తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారురా అని అడగొచ్చు కానీ మాకు సభ్యత అడ్డు వస్తుందని మేము అలా మాట్లాడదలుచుకోలేదని అధికారం ఉన్నప్పుడు రైతులను ఏమాత్రం పట్టించుకోని అయ్యా కొడుకులు అధికారం పోగానే రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.
లక్షల కోట్ల ప్రజాధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి అది కృంగిపోగానే పది టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టింది మీరు కాదా మేం అధికారంలోకి రాగానే వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి మేడిగడ్డ సందర్శనకు రమ్మని ఇబ్బంది అవుతుందని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ లో మీకోసం హెలికాప్టర్ ఏర్పాటు చేస్తామన్నా రాకుండా ముఖం చాటేసారని అన్నారు. గతంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు గత 50 సంవత్సరాలైనా సేవలందిస్తున్నాయని కానీ మూడున్నర సంవత్సరాల క్రితం కట్టిన మేడిగడ్డ కుంగిపోయిన మాట వాస్తవం కాదా మా ప్రభుత్వం రాకముందు 40 రోజులు అధికారంలో ఉన్న మీరు కాళేశ్వరం ఎందుకు రిపేరు చేయలేదు మీ హయాంలో నే కదా కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయాయన్నారు. కాళేశ్వరం పేరు మీద తెలంగాణ ప్రజల 98 వేల కోట్లు సొమ్ము మాయం చేశారని మూడు బ్యారేజీలు రిపేర్ చెయ్యాలని ఢిల్లీకి చెందిన నిపుణులు, అధికారులు చెప్పిన విధంగా మా ప్రభుత్వం రిపేరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి తప్పులు తడకగా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మా ప్రభుత్వం వచ్చి మూడు నెలల్లో కాకముందే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అనే వారి మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడడం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు. నేతన్నల ఆందోళన ప్రభుత్వం గమనిస్తుందని, గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నేతన్నలకు 275 కోట్ల బకాయిపడ్డారని వాటిని వారికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పటివరకు సరైన సమాధానం లేదు అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వారు గత ఎన్నికల కంటే ముందు పాత బకాయి ఇస్తే మా చేతుల్లో ఉండారని బకాయిలను ఆపిన పాపం కేటీఆర్ ది అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. మా ప్రభుత్వం నేతన్నల బకాయిలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2014 సంవత్సరంలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని నేడు అప్పుల కుప్పగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. నేడు 6 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసారని, దానికి మనం బ్యాంక్ లకు ప్రతి ఏటా 70 వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాలన్నారు. ఆనాడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతుల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని అన్నారు. నిన్నటి రోజున కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు..