మున్నూరు కాపులు సమాజ సేవలోనూ ముందుండి రాణించాలని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు నేడు అన్నం పెడుతున్నది రైతన్నలేనని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జగిత్యాలలో ధర్మపురి రోడ్ లో గల బి ఎల్ ఎన్ గార్డెన్ లో జరిగిన జిల్లా స్థాయి మున్నూరు కాపు కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ ఆత్మీయ సమావేశానికి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు రైతులు గానే కాకుండా విద్యా, వైద్యం, ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాలలోనూ ఉన్నారని తెలిపారు. వాటన్నిటి తో పాటు రైతులకు విద్యార్థులకు, పేదలకు, కార్మికులకు, ఇతరత్రా వర్గాల ఉపాధి కల్పనకు కావలసిన సేవలు, ప్రోత్సహాలు అందించి సమాజంలో మున్నూరు కాపులు రాణించాలని కోరారు. కాస్త ఓర్పుతో పని చేస్తే మానవులు సాధించలేనిది ఏదీ లేదన్నారు. రాజకీయ రంగంలోనూ మనమేమీ తీసిపోకుండా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. జగిత్యాల జిల్లాలో నేడు మున్నూరు కాపులు అంతా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం శుభ పరిణామం అన్నారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభా కాంక్షలు తెలిపారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు వుంటాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహా సభ రాష్ట్ర అధ్యక్షులు మనికొండ వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్ లు జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్షులు ఒడ్నాల రాజశేఖర్, చిట్ల రమణ లతో పాటు జిల్లా కార్యవర్గాన్ని, జిల్లా సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. 1930లో మున్నూరు కాపు మహా సభ ఏర్పడిందని వారు తెలిపారు. 1970 లో ప్రభుత్వం చే రిజిస్టర్ చేయబడి నేడు రూ.200 ల కోట్లకు పైగా స్థిర ఆస్తులు కలిగి ఉన్నామన్నారు. 360 అనుబంధ సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు మహా సభ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు మహా సభ ఒకే ఒకటి నిర్విరామంగా మున్నూరు కాపుల అభ్యున్నతి కోసం, అభివృద్ది కోసం, సమాజ సేవలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.
ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత – సురేష్, జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లు హాజరై ప్రసంగించారు. ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, బీర్ పూర్ ఎంపిపి మసర్తి రమేష్ లతో పాటు జిల్లా లోని కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, జగిత్యాల, ధర్మపురి పట్టణాలతో పాటు జిల్లాలోని ఇరవై మండలాల లోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మున్నూరు కాపు సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ రైతులను ఈ సందర్భంగా వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వివిధ ప్రాంతాల నుండి తండోప తండాలుగా తరలి వచ్చిన మున్నూరు కాపులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులతో, ముఖ్య అతిథులతో వారి – వారి పరిచయాలు పెంచుకొని సంఘానికి కట్టుబడి ఉంటూ, సంఘం ద్వారా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అత్యంత చురుకుగా మున్నూరు కాపు సంఘం ద్వారా సమాజ సేవ, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలలో ముఖ్యంగా సేవలు, అవగాహన సదస్సులు నిర్వహించి కుల బాంధవులకు అందరికీ అండగా ఉంటామని నూతన అధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ ఈ సందర్భంగా కుల బాంధవులకు హామీ ఇచ్చారు. సభికులు కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.


