అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఏర్పాట్లు కొనసాగుతుండగా.. ఆలయ ట్రస్టు కొందరు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కర్ణాటక కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వాటిని ఖండించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని, అనుకూలమని క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇలా చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. కర్ణాటక మంత్రి దశరథ సుధార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు అలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను కాపాడుకోవడానికి బిజెపి ప్రభుత్వం పుల్వామా ఉగ్రదాడిని ఉపయోగించుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాళ్లు రాముడు ఫోటోని పట్టుకున్నారు. ఈ రామ మందిరాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అంటూ ఇటీవల కర్ణాటక మంత్రి దశరథ సుధాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఒక ఎన్నికల స్టంట్‌గా ఆయన అభివర్ణించారు. ‘‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఒక స్టంట్. ప్రజలు మూర్ఖులేం కాదు. ఆల్రెడీ రెండుసార్లు మోసపోయాం. మూడోసారి ప్రజలు మోసపోరని నాకు నమ్మకం ఉంది’’ అని కుండబద్దలు కొట్టారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే.. రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని కూడా ఆయన చెప్పారు. ఇదంతా ఒక ఎలక్షన్ జిమ్మిక్ అని పేర్కొన్నారు.
మంత్రి సుధాకర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కర్ణాటక కాంగ్రెస్‌పై బీజేపీ ధ్వజమెత్తింది. రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కొందరు విరుచుకుపడ్డారు. అందుకే.. తాము వ్యతిరేకం కాదని, ఈ నిర్మాణానికి అనుకూలమని సిద్ధరామయ్య పై విధంగా బదులిచ్చారు. ఇదే సమయంలో.. కర్ణాటకలో కన్నడ భాషపై జరుగుతున్న నిరసనలపై సిద్ధరామయ్య మాట్లాడారు. శాంతియుత నిరసనలు ఆమోదయోగ్యమైనవని, కానీ ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఉద్ఘాటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేస్తామని, నిర్దోషులైతే ఎవరినీ అరెస్టు చేయబోమని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.