జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గం డి. మత్స్యలేశం మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి వారి ఇబ్బందులు, సమస్యలను తెలుసుకున్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. మత్స్యలేశం గ్రామంలో 6000 మంది వలస పోవడం బాధాకరమన్నారు. మత్స్యకార యువతకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కళింగపట్నంలో మృతి చెందిన మత్స్యకారుడికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ కి నివేదిక ఇస్తానన్నారు.
జనంలో మాట్లాడడానికి భయమెందుకు?
‘151 స్థానాలు దక్కించుకున్న సీఎం జగన్ జనంలోకి వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నాడు. పరిపాలన చేతగాని వ్యక్తికి ముఖ్య మంత్రి పదవి ఇస్తే ఇలానే ఉంటుంది. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన సభలను కేవలం పవన్ కళ్యాణ్‌ను విమర్శించడానికి వాడుతున్నారు. దమ్ముంటే పోలీసు యంత్రాంగం లేకుండా జగన్ బయటకు రాగలడా? రాజకీయ లబ్ధి కోసమే పవన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. పవన్ సమాజం కోసమే పని చేస్తారు. ఉద్దాన సమస్యలను మొదటిసారి వెలుగులోకి తెచ్చింది పవన్ కళ్యాణే. ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోరుకుంటుంది కానీ మూడు రాజధానులు కోరుకోవడం లేదు.