వనపర్తి/మహబూబ్‌నగర్: బానిసలుగా బతకలేకనే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి చెప్పారు. వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎవరికీ విధులు లేకుండా అన్ని పనులూ మంత్రే చూసుకుంటూ, పెత్తనం చలాయిస్తున్నారని ఆరోపించారు. తమకు కనీస గౌరవం లేదని, అడుగడునా అవమానిస్తున్నారని వాపోయారు. అవమానాలను భరించలేక, బానిసలుగా బతకలేకనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని సల్కెలాపూర్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్మన్, ఇద్దరు ఎంపీపీలు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర నేతలు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను మీడియాకు చూపారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. అవమానాలు జరుగుతున్నా ఎన్నో మెట్లు దిగి మరీ పనిచేసుకుంటూ పోయానని తెలిపారు. మూడు నెలల నుంచి తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, పార్టీలోనే ఉన్నా బహిష్కరించినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తాము ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయిస్తామని చెప్పారు. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒకటైతే అందులో వనపర్తి వేరని అన్నారు. క్యాంపు ఆఫీసులో ఎవరూ తన పక్కన కూర్చోకుండా ఒక్క కుర్చీ మాత్రమే వేసుకొని, అందరూ నిలబడాలనే విధంగా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. పెద్దమందడి, ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాళ్లను తాము సొంత డబ్బులతో పూర్తిచేశామని, ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డికి హితవు పలికారు. నీళ్లు రావడం కోసం పనిచేసింది తామైతే.. మంత్రి ఎలా ‘నీళ్ల నిరంజన్‌రెడ్డి’ అవుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా తాము లబ్ధి పొందినట్లయితే ఉరి వేసుకోవడానికి సిద్ధమని, దమ్ముంటే మంత్రి వచ్చి నిరూపించాలని సవాల్ చేశారు. నియంత పాలన అంతం కోసం, వనపర్తి విముక్తి కోసం రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ.. తాము పార్టీలోకి వస్తేనే గెలుస్తానని చెప్పిన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇప్పుడు తామెవరో తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీరితోపాటు పదిమంది సర్పంచులు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ప్రజాపతినిధులు కూడా బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
బీఆర్‌ఎస్‌లో ధిక్కార స్వరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ధిక్కారగళం వినిపిస్తున్నారు. జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రధానంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింటిలో బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తుండగా.. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ ఒకటి, రెండు చోట్ల అసంతృప్త గళాలు వినిపిస్తున్నాయి. వనపర్తి నియోజకవర్గంలో తాజాగా జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో పాటు ఇద్దరు ఎంపీపీలు, పలువురు సర్పంచులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేతలంతా మంత్రి నిరంజన్‌రెడ్డిపై అసంతృప్తితోనే బీఆర్‌ఎ్‌సను వీడుతున్నట్లు ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఓ వర్గంగా, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మరో వర్గంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. అచ్చంపేటలో ఎంపీ రాములు తనయుడికి జడ్పీచైర్మన్ పదవి దక్కకుండా ఎమ్మెల్యే బాలరాజు చక్రం తిప్పారన్న వాదన వినిపిస్తోంది. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి మధ్య వర్గపోరు తీవ్రంగా సాగుతోంది. గద్వాల నియోజకవర్గంలోనూ సిటింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై బీసీ నేతలు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు.అలంపూర్‌లో బీఆర్‌ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే అబ్రహాం మరోసారి తనకుగానీ, తన కుమారుడు అజయ్‌కుమార్‌కు గానీ టిక్కెట్ పక్కా అని ప్రచారం చేసుకుంటుంటే, ఈసారి తాను పోటీ చేస్తానని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ చెబుతున్నారు.