గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను వసూళ్ల అంశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని, దీనికి కృషి చేసిన పంచాయతీ శాఖ అధికారులు సిబ్బంది సహకరించిన ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 30 ,2024 నాటికి వసూలు చేసిన ఆస్తి పన్ను వివరాల నివేదిక ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 255 గ్రామ పంచాయతీల పరిధిలో 7 కోట్ల 5 లక్షల రూపాయల ఆస్తి పన్ను వసూలుకు గాను 6 కోట్ల 92 లక్షల రూపాయల వసూలు చేసి 98.19 శాతం ఆస్తి పన్ను వసూలు చేశామని రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఆస్తిపన్ను వసూలు చేసిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని, పెండింగ్ లో ఉన్న 13 లక్షల ఆస్తిపన్ను వసూలు చేయడానికి అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని, ఇదే స్ఫూర్తి రాబోయే సంవత్సరంలో సైతం చూపాలని , ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.