హైదరాబాద్: చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు హత్య బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం వల్లే ఘాతుకం జరిగిందని తెలిపారు. పరిష్కారం జాప్యమైతే ఎలాంటి పరిణామాలు.. ఉంటాయన్నదానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం మంత్రుల కమిటీ పనిచేయడం లేదని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. గొత్తికోయల దాడిలో శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్యకు కారణాలేమైనా ఉన్నాయా? మావోయిస్టుల కోణం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్వో స్థాయి వ్యక్తి బైక్‌పై ఎందుకు వెళ్లారు? అనే కోణంపైనా విచారణ జరుపుతున్నారు.