కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ పార్టీ అవినీతి, బంధుప్రీతి, గడీలపాలనతో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని బిఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల కుప్పగా మార్చి సొంత ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. సగటు జీవి నెలకు 16000 సంపాదిస్తే అందులోంచి 7వేల రూపాయలు అప్పులు తీర్చడానికి వెళ్తే ఆ కుటుంబం పరిస్థితి ఏవిధంగా ఉంటుందో నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులకే వెళ్ళడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అదే విధంగా ఉందని నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఈ ఆర్థిక విధ్వంసానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నాడు ఉన్నటువంటి గంగుల కమలాకర్ సైతం బాద్యుడేనని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెళ్లి పోలీసు కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఏడాది క్రితం నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మరియు జంక్షన్లు కమీషన్ల కక్కుర్తి వల్లే తొందరగా చెడిపోయాయని అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుందని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు గత అయిదు సంవత్సరాలుగా బల్దియాలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరగాలని పలుమార్లు కోరాడని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దీనిపై ఎందుకు మాట్లాడుతలేడనీ నరేందర్ రెడ్డి అన్నారు. భూకబ్జాల రొచ్చులో బాధ్యులుగా ఉన్న బిఆర్ఎస్ నాయకులను తీసుకొనిపోయి సిపికి, కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందని దొంగే దొంగా దొంగా అన్నట్లు గంగుల నిర్వాకం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బిఆర్ఎస్ పాలనతో బేజారై పోయారని అవినీతి భూకబ్జాలతో ప్రజలను పరేషాన్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలను కడిగి వేయడం కోసమే కాస్త సమయం పట్టిందని జిల్లాను ప్రణాళిక బద్ధంగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు మేయర్ పై చేసిన ఆరోపణల పేపర్ క్లిప్పింగ్ లు, వీడియోలు నరేందర్ రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, జీడి రమేష్, కుర్ర పోచయ్య, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, ఊరడి లత, మహాలక్ష్మి, హసీనా, తిరుమల శిరీష్, వెంకట్ రెడ్డి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు


