తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల అంగీకారం ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వేగవంతం చేయాలని సింగిల్ విండో ఐకెపి, రైసు మిల్లర్ యజమానులను బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు నిర్వాహకులు రైస్ మిల్లుల యజమానుల అంగీకారం ప్రకారం కొనుగోలు జరగాలన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలుగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోని బాధ పడ్డారని వారి ఇబ్బందులు బాధలు పునారావృతం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని, వారి ఆదేశాల మేరకు రైతులకు మేలు జరగాలన్నారు.
ఆగస్టు మాసం వరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు వర్షాకాల పంట వరకు 500 రూపాయల బోనస్ అందిస్తామని అయన తెలిపారు. ఇందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతుల ఇష్ట ప్రకారంగానే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగాలని ఆయన కోరారు. నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర 2203 రూపాయలను పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే నిర్వాహకులపై రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు భానోత్ రాజు నాయక్, నాయకులు బండారి బాల్ రెడ్డి, కొత్త పల్లి దేవయ్య, సోషల్ మీడియా ప్రతినిధి భీపేట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు,