మండుటెండలు తట్టుకోలేక ఓ పసిపాప ఊపిరి ఆగిన దురదృష్ట సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకి చెందిన బుర్క రాకేష్ రిషిత దంపతుల రెండో కూతురు అన్విశ్రీ (4 నెలలు) వడదెబ్బతో సోమవారం ఉదయం మృతి చెందింది. అన్విశ్రీ గత నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ దవాఖాలలో టీకా ఇప్పించారు. ఈ క్రమంలో చిన్నగా జ్వరం వస్తుందని వైద్యులు జాగ్రత్తలు చెప్పారు. జ్వరం రావడంతో పాపను జాగ్రత్తగా చూసుకున్నారు. గత మూడు రోజులుగా తీవ్రమైన వడగాలులు రావడంతో ఇంట్లో వాతావరణం కూడా వేడెక్కిపోవడంతో రెండు రోజులుగా చిన్నారికి విరేచనాలు మొదలయ్యాయి. గత రాత్రి విరేచనాలు ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం హాస్పిటల్ కు తీసుకెళ్దాం అనుకునే లోపే అన్విశ్రీ తుదిశ్వాస విడిచింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.