ఏడు గ్రామాలకు జీవనాధారమైన సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగ వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగా నిర్వహణ కమిటీ సభ్యులు ఓగ్గు బాలరాజు యాదవ్, నేవూరి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో మరో పది మందితో కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో వివిధ వర్గాల ద్వారా విరాళాలు సేకరించి మైసమ్మ పండుగా ఘనంగా నిర్వహించారు.
పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం సింగసముద్రం కట్టపై గల కట్టమైసమ్మకు ప్రతి యేటా గ్రామంలో పాడిపంట పిల్లా జెల్లా సల్లంగా చూడాలని కోరుతూ వివిధ కులాల ఆయకట్టు రైతుల ఆర్థిక సహాయంతో రెండు రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు. పోతరాజులు గ్రామంలో పట్టు పరిచి దున్నపోతును పసుపు కుంకుమలతో ఆలంకరించి వేపఆకులతో తయారు చేసిన దండను మెడలో వేసి పూలమాలలతో చూడ ముచ్చటగా అలంకరించి గ్రామంలోని గ్రామ దేవతలందరికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రధాన వీదుల్లో దున్నపోతును డప్పు దరువులతో తిప్పి కట్ట మైసమ్మ గుడికి వివిధ కులవృత్తుల వారు ఊరేగింపుగా చేరుకొని మైసమ్మ పండుగ రాత్రంతా ఘనంగా నిర్వహిస్తారు.
పోతురాజులు మైసమ్మను వివిధ రూపాల్లో కొలుస్తారు. ప్రత్యేక పూజలు సోమవారం ఉదయం వరకు చేస్తారు. అనంతరం దున్నపోతును, మేకలను కట్ట మైసమ్మ కు బలి ఇస్తారు. సోమవారంతో ఈ వేడుక పూర్తవుతుంది. ఈ మైసమ్మ పండుగ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు, వివిధ కుల వృత్తులవారు పాల్గొని ఘనంగా పండుగ వేడుకలు జరుపుకుంటారు.