తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్న ఆందోళన మంగళవారం మూడో రోజుకు చేరింది. ఆందోళన చేస్తున్న నర్సులను అదుపుచేసేందుకు పోలీసులు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో కరోనా సమయంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల్లో నియమితులైన నర్సులను డిస్మిస్ చేస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలి, మెడికల్ ఎగ్జామ్ కమిషన్ ద్వారా తమను ఎంపిక చేసి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలంటూ గత రెండ్రోజులుగా నర్సులు చేపట్టిన ఆందోళన మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. ఉదయం ఆందోళనలో పాల్గొన్న నర్సులను అడ్డుకున్న పోలీసులు అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడం నేరమని ఆ ప్రాంతం నుంచి తరిమేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన నర్సులు తమ డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలించే వరకు పోరాటం ఆగదని, తమ న్యాయమైన హక్కుల కోసం గళం విప్పేందుకు పోలీసులు అడ్డుకోవడం ఖండించదగ్గదన్నారు.