Monday, October 7, 2024
spot_img
HomeBUSINESSకొత్త ఏడాది.. కొత్త కార్లు..

కొత్త ఏడాది.. కొత్త కార్లు..

దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. గడచిన రెండేళ్లలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయటం ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన ఆటోమొబైల్‌ రంగం 2024లో…

కొత్త మోడల్స్‌ విక్రయాలతో రూ.30,000 కోట్ల వరకు అదనపు రాబడి అంచనా

దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. గడచిన రెండేళ్లలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయటం ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన ఆటోమొబైల్‌ రంగం 2024లో ఏకంగా 24 కొత్త మోడల్స్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్‌ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేయనున్న కార్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల విక్రయాలతో ఆటోమొబైల్‌ కంపెనీల రెవెన్యూ రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొవిడ్‌ అనంతరం ప్రజలు వ్యక్తిగత రవాణా పట్ల అమితాసక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. అప్పటి వరకు ద్విచక్ర వాహనానికి పరిమితమైన వినియోగదారులు కూడా కార్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైపోయారు. అందుకు తగ్గట్టుగానే ప్యాసింజర్‌ వాహన విభాగంలో ఆటోమొబైల్‌ కంపెనీలు గడచిన రెండేళ్లలో పెద్ద ఎత్తున కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. నాన్‌ లగ్జరీ విభాగంలో కొత్త మోడళ్లను తీసుకురావటంతో పాటు ఎలక్ట్రిక్‌ కార్లపై కంపెనీలు ప్రధానంగా దృష్టి సారించాయి.

రూ.4.5 లక్షల కోట్ల మార్కెట్‌..

కొద్ది కాలంగా నిలకడైన పనితీరును కనబరుస్తూ వస్తున్న దేశీయ ప్యాసింజర్‌ వాహన మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.4.5 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే ఏడాదిలోనూ కొత్త మోడళ్ల విడుదల, సరికొత్త ఈవీలతో మార్కెట్‌ తన జోరును కొనసాగించే అవకాశం ఉండటంతో పాటు మార్కెట్‌ విలువ కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ (ఐస్‌)తో కూడిన స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)తో పాటు ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి.

మారుతిదే హవా

2022,2023లో కొత్త మోడళ్ల విడుదలతో మార్కెట్‌ వాటాను గణనీయంగా పెంచుకున్న మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ ఐ).. 2024లో అదే జోరును కొనసాగించేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది టోక్యో ఆటో షోలో ప్రదర్శించిన న్యూ జెనరేషన్‌ స్విఫ్ట్‌తో పాటు కొత్త డిజైర్‌ను కొత్త ఏడాదిలో విడుదల చేయనుంది. వీటితో పాటు మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్‌ కారు ‘ఈవీ ఎక్స్‌’ను 2024లో మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రీమియం విభాగంలో ఈ కారు తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుందని అంచనా వేస్తోంది. ఎలక్ట్రిక్‌ కార్లను కూడా నెక్సా షోరూమ్స్‌ ద్వారా విక్రయించాలని భావిస్తోంది. 2023లో కొత్త మోడళ్ల విక్రయాలే 2.87 లక్షల యూనిట్లుగా ఉండటం విశేషం.

ఎలక్ట్రిక్‌ వాహన విభాగంపై టాటా మరింత పట్టు

2024లో టాటా మోటార్స్‌.. ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఏడాదిలో టాటా పంచ్‌, సఫారీ ఎలక్ట్రిక్‌ వెర్షన్స్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. దీంతోపాటుగా న్యూ కర్వ్‌ పేరుతో కొత్త ఈవీని విడుదల చేయనుంది. ఇక మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ఎక్స్‌యూవీ ఈ.8, ఎక్స్‌యూవీ 700 ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను తీసుకువస్తోంది. అలాగే అప్‌డేటెడ్‌ ఎక్స్‌యూవీ 400, కొత్తతరం ఎక్స్‌యూవీ 300తో పాటు ఐదు డోర్లతో కూడిన థార్‌ను మార్కెట్లోకి పరిచయం చేయనుంది. మరోవైపు స్కోడా ఫోక్స్‌వ్యాగన్‌ ఆటో ఇండియా కూడా ఎన్‌యాక్‌ 4 పేరుతో ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెడుతోంది.

హ్యుండయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌

మరోవైపు హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా.. సూపర్‌ ప్రీమియం విభాగంలో ఇప్పటికే ఐకానిక్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును విక్రయిస్తోంది. తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అందుబాటు ధరల్లో క్రెటా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 2024 ద్వితీయార్ధంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త క్రెటా, టుసన్‌, అల్కాజర్‌ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు హ్యుండయ్‌ గ్రూప్‌నకు చెందిన కియా.. ఈవీ 9 కారుతో పాటు కొత్త తరం కార్నివాల్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments