హైదరాబాద్: ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న వీఆర్‌ఏలు.. దాని ప్రయోజనాలను పొందకపోగా.. జీతాలు కూడా లేక అల్లాడుతున్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం.. వారికి జాబ్ చార్ట్‌ను మాత్రం ఖరారు చేయలేదు. ఉద్యోగ గుర్తింపు నంబరు (ఐడీ నంబరు) కూడా జారీ చేయలేదు. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నా నెల నెలా వేతనం గానీ, ఇతర భత్యాలు గానీ అందడంలేదు. గడచిన నాలుగు నెలల జీతంతోపాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 80 రోజులపాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. దీంతో 16 వేల మంది పూర్వ వీఆర్‌ఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇంకా 4 వేల మంది వీఆర్‌ఏలు సర్దుబాటు పోస్టుల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన
కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరిస్తుందేమోనని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన వీఆర్‌ఏలు.. గత ఏడాది 80 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చివరికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్ సర్కారు దిగొచ్చి.. వారి డిమాండ్‌కు సూచనప్రాయంగా అంగీకరించింది. అనంతరం గత ఆగస్టులో క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుంది. 2020 రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తూ వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది.
3 కేటగిరీలుగా విభజించి క్రమబద్ధీకరణ..
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలను క్రమద్ధీకరిస్తున్నట్లు నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రకటించింది. ఈ మేరకు వీఆర్‌ఏలను ఆరు విభాగాల్లో నియమించేందుకు ఆగస్టు 4న ఆర్థిక శాఖ కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీరిలో 16,758 మంది వీఆర్‌ఏలను వారి విద్యార్హతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు. డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న 3,680 మంది, ఇంటర్ పాస్ అయిన 2,761 మంది, 10వ తరగతి వరకు చదువుకున్న 10,317 మందిని వేర్వేరు కేటగిరీలుగా పేర్కొన్నారు. వీరుకాకుండా 61 ఏళ్ల వయసు దాటిన వీఆర్‌ఏలు మరో 3686 మంది ఉన్నారు. అయితే వీరందరిలో 16,697 మంది వీఆర్‌ఏలకు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. వీరిని విద్యార్హతల ఆధారంగా.. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేట్లుగా, చైన్‌మెన్ పోస్టుల్లో నియమించారు. మరికొందరికి మునిసిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లుగా, నీటిపారుదల శాఖలో లస్కర్లు, మిషన్ భగీరఽథలో హెల్పర్లుగా పోస్టింగ్ ఇస్తూ ఆగస్టు 10న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీఆర్‌ఏలకు ఇతర శాఖల్లో పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నవారు తప్పుబట్టారు. ఈ నియామకాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీఆర్‌ఏల విలీనం, ఇతర శాఖల్లో వారి సర్దుబాటుకు సంబంధించిన జీవో 81, 85లను హైకోర్టు సస్పెండ్ చేసింది. అప్పటినుంచి వీఆర్‌ఏలు ఎటూ కాకుండా పోయారు.
రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి..!
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్వ వీఆర్‌ఏలకు ప్రభుత్వం కొత్త పోస్టుల ప్రకారం జీతం చెల్లించలేదు. పాత పోస్టుకు సంబంధించిన జీతమైనా చెల్లిద్దామంటే వీఆర్‌ఏల రద్దు అంశం ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో అప్పటినుంచి వారికి జాబ్ చార్టు గానీ, ఉద్యోగి ఐడీ గానీ కేటాయించకుండా, జీతాలూ చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇలా కొనసాగుతుండగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. వారికి నాలుగు నెలల పెండింగ్ వేతనాలతోపాటు గతంలో వీఆర్‌ఏలుగా ఉన్నప్పుడు చేపట్టిన 80 రోజుల సమ్మెకాలానికి సంబంధించిన వేతనం కూడా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొందరు వీఆర్‌ఏలు జీతాలు రాక, ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. వీరి సమస్యను పరిష్కరించడంతోపాటు పోస్టులు రాకుండా మిగిలిన దాదాపు 4 వేల మంది వీఆర్‌ఏల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా.. గుర్తించిన వీఆర్‌ఏల్లో విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్‌ఏ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు 61 ఏళ్ల వయసు పూర్తయిన వారి కుటుంబ సభ్యులకు, వివిధ కేసుల్లో సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పోస్టింగ్ ఆర్డర్ దక్కని వారికీ పోస్టులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పూర్వ వీఆర్‌ఏలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న భరోసాతో ఉన్నారు.