పార్టీ లేకుంటే ఎవడూ పట్టించుకోడు: బొత్స
లక్కవరపుకోట, డిసెంబరు 28: అధికారం కోల్పోతే ఎంతటి వారికైనా అవమానం తప్పదని విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా ఎస్.కోటలో జరిగిన నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు. 2014లో తన ఓటమిని గుర్తుచేశారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావలసిన బాధ్యత గృహ సారథులు, కన్వీనర్లపై ఉందన్నారు. ఓడిపోతే మనల్ని ఎవరూ పట్టించుకోరన్నారు. పార్టీ ఉంటేనే అందరం సంతోషంగా ఉంటామని, లేదంటే మనల్ని ఎవడూ పట్టించుకోడని అన్నారు. పార్టీ పదవుల నియామకాల్లో స్థానిక ఎమ్మెల్యే కడుబండి నివాసరావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్.కోట, వేపాడ మండలాల కార్యకర్తలు ధ్వజమెత్తారు. బొత్స స్పందిస్తూ.. అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. సమావేశానికి చాలామంది కార్యకర్తలు రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.