కందుకూరు బహిరంగ సభలో అనూహ్యంగా జరిగిన విషాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. వేదికపై ఉండేందుకు మనస్కరించక.. సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘గాయపడినవారిని ఆదుకోవడానికి నాయకులందరినీ ఆస్పత్రి వద్దకు పంపాను. మీరు అనుమతిస్తే నాకూ అక్కడకు వెళ్లాలని ఉంది, గాయపడిన వారిని పరామర్శించి మళ్లీ వస్తాను’ అని కోరడంతో జనమంతా వెళ్లిరమ్మని నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు హుటాహుటిన కందుకూరు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడి చికిత్స పొందుతున్నవారిని చూసి చలించిపోయారు. చాలాసేపు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి వర్గాలను కోరారు.
కందుకూరులో జరిగిన ఘటన అనంతరం ఎన్టీఆర్ కూడలికి వచ్చి.. బహిరంగ సభను రద్దుచేస్తున్నానంటూ.. దానిని సంతాప సభగా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.పది లక్షలు చొప్పున పరిహారాన్ని పార్టీ తరఫున అందజేస్తామని ప్రకటించారు. ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఆవేశం, బాధ ఉందని.. అందుకే ఎక్కువ మంది ఇందేం ఖర్మ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పారు. తన సభలకు పోలీసులకు కూడా ఎక్కువగా వచ్చి ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు టీడీపీ నేతలంతా అండగా ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటారని అన్నారు. మరోసారి కందుకూరుకు వస్తానన్నారు. సభకు వచ్చిన వారందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని సూచించారు.
ఎప్పుడూ ఇలా జరగలేదు..
40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని టీడీపీ అధినేత వాపోయారు. ‘మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఎన్టీఆర్ కూడలిలోనే మీటింగ్‌లు పెడుతూ ఉంటాం. ఈ రోజు అనూహ్యంగా మీరంతా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ వ్యాను ఎక్కినప్పటి నుంచి చెబుతూనే ఉన్నా. దిగమని నివారిస్తూనే ఉన్నా. తమ్ముళ్లు కొద్దిగా ఉత్సాహంగా ఉండడం, అదుపు తప్పి కొంత మంది కిందపడిపోయారు. ఇంకొద్ది మంది వాళ్లమీద పడిపోవడం, అక్కడ మోటారు బైకుల మీద పడిపోవడం జరిగింది. ఈ ఘటన నా మనసును కలచివేసింది. చాలా బాధపడుతున్నా. ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చా. మీలో కూడా ఒక ఆవేశం, బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇక్కడ దురదృష్టకర సంఘటన జరిగింది. కొంత మంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు. కొన్ని మన చేతుల్లో ఉండవు. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు.. సంఘీభావం తెలియజేయాలని అనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయ్. అమాయకులు చనిపోవడం చాలా బాధిస్తోంది. వారి కుటుంబాలకు అండగా ఉంటా. రేపు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉండి చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపేలా వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తారు. క్షతగాత్రులు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమి చేయాలో అన్నీ చేయాలని నాయకులకు సూచించాను’ అని తెలిపారు. చనిపోయినవారికి సంతాపం ప్రకటిస్తూ కొంత సేపు మౌనం పాటించారు.