జగిత్యాల జిల్లా
బుగ్గారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న అంగన్ వాడీ టీచర్ల, ఆయాల దీక్షా శిబిరంలో గురువారం ఆయన పాల్గొన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం “అంగన్ వాడీ ఆడ వాళ్ళతో” పెట్టుకుంటే కేసీఆర్ బ్రతుకు, ప్రజా ప్రతినిదుల బ్రతుకు ఇక “ఆగ – మాగమే” అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 18 రోజులుగా కొనసాగుతున్న అంగన్ వాడీల న్యాయ పోరాటానికి అండగా ఉండి ఉద్యమాల రథ సారథి ప్రొపెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో కలిసి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్ వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే ఈ ప్రభుత్వం నెరవేర్చి, వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు పర్చి, పెన్షన్, ఇతర సదుపాయాలు, ఇతర అలవెన్సులు అన్నీ చెల్లించాలని ఆయన కోరారు.
ఏదైనా ఒకే ఒక ప్రభుత్వ శాఖకు అంగన్ వాడీలను పరిమితం చేసి, మిగతా శాఖల పనుల నుండి, వెట్టి చాకిరి నుండి వీరిని విముక్తులను చేయాలని ఆయన కోరారు. అంగన్ వాడీ సెంటర్లలో రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల కార్యక్రమాలు నిలిపివేయాలని, ఇతర శాఖల పనులు వారికి చెప్పడం మానుకోవాలని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు అంగన్ వాడీలను బెదిరిస్తూ శ్రమ దోపిడీ చేస్తూ, వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆడవారిగా వారికి ఉండే హక్కులు వారికి ఉంటాయని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలి తప్పా వేదింపులకు గురి చేస్తే, శ్రమ దోపిడీకి పాల్పడితే వారికి అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తూ చట్టపరంగా శిక్ష పడేదాక ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అంగన్ వాడీలు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక అంగన్ వాడీ సెంటర్ ఏర్పాటు చేసి, నియామకాలు చేపట్టాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం మీ హక్కులు, మీ సమస్యలు, మీ డిమాండ్ లు పూర్తి స్థాయిలో నెరవేరే దాకా మరింత ఉదృతంగా ఉద్యమాలు చేస్తూ తెగించి కొట్లాడాలి అని అంగన్ వాడీ టీచర్లకు, ఆయాలకు ఆయన పిలుపునిచ్చారు.