బాలి: ఇండొనేషియా బాలిలో జరుగుతోన్న జి20 సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. డిన్నర్ సమయంలో ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి ముఖాల్లో సంతోషం కనపడింది. గల్వాన్ ఘటన తర్వాత మోదీ, జిన్‌పింగ్ తొలిసారి కరచాలనం చేశారు.
సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంఘం సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడుకోలేదు. జిన్‌పింగ్‌తో మోదీ కనీసం కరచాలనం కూడా చేయలేదు.
జీ 20 సమావేశాల్లో భాగంగా మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్‌నూ కలుసుకున్నారు. సమావేశాల ముగింపు రోజు జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతలను ఇండొనేషియా భారత్‌కు అప్పగించనుంది. ఏడాది పాటు జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించనుంది. వచ్చే ఏడాది జరిగే జీ20 కూటమి సమావేశాలకు భారత్ ఆతిథ్యమీయనుంది. జీ20 కూటమిలో అమెరికా, ఆస్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ, అర్జెంటైనా, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, చైనా, ఇండొనేషియా, జపాన్, దక్షిణకొరియా, భారత్ ఉన్నాయి.