న్యూఢిల్లీ: నిత్యం వివాదాలు.. విమర్శలు.. విభేదాలతో చర్చల్లో నిలిచిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ పదవి నుంచి వైదొలిగారు. గత నెలలో ప్రధాని మోదీని కలిసిన ఆయన ‘ఇక, గవర్నర్‌గా ఉండలేను దిగిపోతా!’ అని చెప్పినట్టే ఆ పదవికి రాజీనామా చేశారు. కోశ్యారీ చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోద ముద్ర వేశారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన కోశ్యారీ.. తొలి నుంచి వివాదాలకు కేంద్రంగా మారారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా మరాఠాల సెంటిమెంటు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలు బహిరంగ ఆందోళనలకు సైతం దారితీశాయి. ‘‘శివాజీ గత తరాలకు మాత్రమే చిహ్నం. ఇప్పటి వారికి కాదు’’ అని గత ఏడాది నవంబరులో కోశ్యారీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా నేతలు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంతో కోశ్యారీ నిత్యం వివాదాల్లో మునిగితేలారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పించేవారు. సర్కారు తీసుకున్న నిర్ణయాలను తిప్పికొట్టడంతో వార్తల్లో నిలిచారు.