ప్రత్యామ్నాయ పంటలో సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో యాసంగి సీజన్ 2023-24 విత్తిన పైరు విస్తీర్ణములకు స్థిరీకరణ సమన్వయ సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలో వివిధ అధికారులతో చర్చించి పంటల వారీగా స్థిరీకరించబడిన విస్తీర్ణం పరిగణలోకి తీసుకొని జిల్లాస్థాయి పైరు విస్తీర్ణములను తయారు చేశారు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ యాసంగి సీజన్ లో జిల్లాలో మొత్తం 1,78,574 ఎకరంలు సాగు జరిగిందని, ఇందులో అత్యధికంగా 97.8% మేర వరి పంట సాగు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుత సీజన్లో భూగర్భ నీటివనుల ద్వారా 1,51,100 ఎకరాలకు, ఉపరితుల జల వనరుల ద్వారా 27,474 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని అన్నారు. జిల్లాలో రాబోయే వ్యవసాయ సంవత్సరంలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని, ఆయిల్ పామ్, పండ్ల పెంపకం, కూరగాయల సాగు మొదలగు వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సబ్సిడీలను రైతులకు వివరిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు అధికంగా జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి జ్యోతి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.