కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు. సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని (TWJF) ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు ఇష్యూస్ తీసుకొచ్చారని చెప్పారు. తన ఊరిలో మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని గుర్తించానని చిన్ననాటనే తండ్రిని కోల్పోయి సమస్యలపైన పోరాడుతున్న తాను ప్రశ్నించినా సమస్యలకు సొల్యూషన్ దొరకలేదని పేర్కొన్నారు. రైతులు, యువత, నిరుద్యోగుల పక్షాన బలంగా ప్రశ్నించడంతో పాటు వారి సమస్యల పరిష్కారనికి పోరాడేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
కేంద్ర ప్రభుత్వాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వాటి అమలు క్షేత్రస్థాయిలో అసలు జరగడం లేదని విమర్శించారు. అన్ని రంగాలలో సమస్యలు చాలా ఉన్నాయని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెయిన్ ఇష్యూస్‌కు సొల్యూషన్ ఇచ్చేందుకు, ఉపాధి కల్పన, స్టార్టప్ ఐడియాస్‌కు ప్రోత్సాహం, ఉచిత విద్య, వైద్యం వంటి అంశాలపైన తాను దృష్టి సారించనున్నట్టు నొక్కి చెప్పారు. రైతులకు పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా పోరాడుతానని తెలిపారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి ఇప్పటి వరకు మహిళలు పోటీ చేస్తున్న సందర్భాలు చాలా తక్కువని, ఈ క్రమంలో తనకు యువత మద్దతు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి యువతీ యువకులు, మేధావులు తనను సపోర్ట్ చేస్తున్నారని, మార్పు కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్న తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను పేరాల మానస అభ్యర్థించారు.