నడికూడ, ఫిబ్రవరి 12: ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో.. ఏమో.. పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు కుమారులను బావిలో తోసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు చిన్నకొడుకు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన మామిడి కావ్య (38)కు, కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కుమారస్వామితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు విద్యాధర్ (8), శశిధర్ (6) ఉన్నారు. కుమారస్వామి అటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా, శనివారం కావ్య తల్లిదండ్రులను తీసుకుని కుమారస్వామి తన ఆటోలో వేములవాడ వెళ్లాడు.
ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో.. ఇద్దరు కుమారులను తీసుకుని కావ్య గ్రామ శివారులో ఉన్న తమ పొలంలో పత్తి ఏరడానికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పిల్లలను తోసి ఆమె కూడా దూకింది. ఈ ఘటనలో కావ్య, ఆమె చిన్న కొడుకు శశిధర్ మృతి చెందారు. పెద్ద కుమారుడు విద్యాధర్ బావిలోని మోటార్ పైపును పట్టుకొని కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి బయటకు తీశారు. దామెర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కావ్య ఆత్మహత్యకు గల కారణాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. తల్లి, కుమారుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కావ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతోనే కావ్య ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా కావ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.