బెంగళూరు: ఏడాది ముగింపు వారం రాష్ట్రంలో మద్యం వ్యాపారాలు కాసులు కురిపించాయి. డిసెంబరు 23 నుంచి 31 దాకా ఏకంగా రూ.1262 కోట్ల వ్యాపారాలు సాగినట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఏకంగా20.66 లక్షల లీటర్‌ల మధ్యాన్ని రాష్ట్ర ప్రజలు తాగేసినట్లు అయ్యింది. ఇందులో 15.4లక్షల లీటర్‌ల బీర్ విక్రయాలు సాగింది. డీసెంబరు 27న 3.57లక్షల లీటర్‌లు, 28న 2.31 లక్షల లీటర్‌లు, 29న 2.31 లక్షల లీటర్‌లు, 30న 2.93 లక్షల లీటర్‌లు, 31న మూడులక్షల లీటర్‌లకు పైగా విక్రయాలు సాగాయి. చివరి రోజునే జరిగిన మధ్యం విక్రయాలు సుమారుగా రూ.181 కోట్లకు పైగానే ఉంటుందని అబ్కారీ శాఖ ప్రకటించింది. ఏడాది చివరన రెండురోజులు 8.24లక్షల ఐఎంఎల్, 6.62లక్షల బీర్ బాక్సులు విక్రయించారు. కొత్త సంవత్సర ఆరంభాన చర్చిస్ట్రీట్, బ్రిగేడ్ రోడ్‌లలోని పబ్‌లకు భారీగా డిమాండ్ రావడంతో ఏకంగా 50శాతం కంటే ఎక్కువ ధరలకు విక్రయాలు సాగించినట్లు తెలిసింది. నగరంలోని దాదాపు అన్ని పబ్‌లు యువతతో నిండిపోయాయి. రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.29వేల కోట్ల మధ్యం వ్యాపారాలను లక్ష్యంగా పెట్టుకోగా డిసెంబరు 29వ తేదీ నాటికే రూ.21981 కోట్ల మేర ఆదాయం సాధ్యమైంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత సంవత్సరం ఇప్పటికే 14శాతం విక్రయాలు అధికమైనట్లు అబ్కారీ శాఖ ప్రకటించిన గణాంకాలు నిర్ధారిస్తున్నాయి.