‘‘కల్వకుంట్ల కుటుంబ ప్రతినిధులు దశల వారీగా ప్రెస్ మీట్లు పెడుతూ.. మేమే చాలా నీతిమంతులం.. మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని అంటున్నారు. నోటికి ఏది వస్తే.. అది మాట్లాడుతున్నారు. వారి తీరు చూస్తే ‘ఉల్టా చోర్.. కొత్వాల్ కు డాంటే’ అన్నట్లుగా ఉంది. మీరు ఢిల్లీకి వెళ్లి మద్యం స్కాం చేసి డబ్బులు సంపాదించాలని తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు ఏమైనా చెప్పారా? మీ అక్రమ వ్యాపారానికి, తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్ పెడుతున్నారు? సీఎం బిడ్డ, ఒక మహిళ ఢిల్లీ నడిబొడ్డున అక్రమ వ్యాపారం చేసినందుకు తెలంగాణ పరువు పోయింది’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఆయన క్యాబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని గుర్తుచేశారు. ‘‘మహిళా రిజర్వేన్లపై మీ మిత్ర పక్షం.. మజ్లిస్ పార్టీని మీరు ఒప్పించారా? ఆర్జేడీ, ఎస్పీ వంటి మీ మిత్ర పక్షాలే కదా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి’’ అని విమర్శించారు. మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారని తెలిసే.. మహిళా రిజర్వేషన్ పేరుతో సానుభూతి కోసం డ్రామా చేస్తున్నారని విమర్శించారు. అన్నాచెల్లెళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదని.. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు