పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ ను ఛార్జింగ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం ఇతరులకు వెళ్లే అవకాశాలు ఉంటాయని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం గురువారం సిరిసిల్ల పట్టణం డా.బి.ఆర్.అంబేడ్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి టి.ఎన్. మల్లికార్జున రావు తో కలిసి జిల్లా విద్యాధికారి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను అలవర్చుకోవాలని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచన ప్రకారం ప్రతి సంవత్సరం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని తమ యొక్క అకౌంట్ వివరాలను గాని ఓటీపీలను గాని ఎవరితోనూ పంచుకోవద్దని పబ్లిక్ ప్రదేశాల్లోని పబ్లిక్ బ్యాటరీ ఛార్జర్స్ ఉపయోగించరాదని తద్వారా తమ యొక్క వ్యక్తిగత వివరాలు సైబర్ నేరస్తులకు చేరుతాయని ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో వారు పొదుపును చేసుకుని భవిష్యత్తులో వాళ్ల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఆర్ధిక అక్షరాస్యత పాటించాలని కోరారు. పొదుపు చేయడం విద్యార్థి దశ నుండే అలవాటు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, యూబీఐ చీఫ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, ఎంఈఓ రఘుపతి, డి హబ్ కో ఆర్డినేటర్ రోజా, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.