గ్రామాలు, పట్టణాల్లో ప్రజల క్షేమం కోసం, తల్లిబిడ్డల ఆరోగ్యంతో పాటు అన్నిరకాల వ్యాధుల నిర్మూలనకు కృషి చేస్తున్న రెండవ ఏఎన్ఎం, యూపిహెచ్ సి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 6 వేల మంది ఏఎన్ఎం ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కొందండరాంలు హామీ ఇచ్చారు.
రెండవ ఏఎన్ఎం లతో పాటు వివిధ రకాల రిక్రూట్మెంట్ అయి గత 17 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 6వేల మందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీజేఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ లను గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్స్ ఉద్యోగులు, వర్కర్స్ యూనియన్ ఏఎన్ఎం ల సంఘం రాష్ట్ర నాయకురాలు గాండ్ల మధురిమ, ఏ.పద్మ, రాజేశ్వరి లు కలిసి వినతిపత్రం అందజేయగా వారు సానుకూలంగా స్పందించారని మధురిమ తెలిపారు.
ఈ సందర్భంగా గాండ్ల మధురిమ మాట్లాడుతూ గత ఏడాది జులై నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి ఏలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరినట్లు వివరించారు. గ్రామాల్లో అంటురోగాలు, ఇతర వ్యాధులు ప్రబలితే డాక్టర్లు కాదని ప్రజలతో మమేకమై ఏఎన్ఎం లు వైద్య సేవలు అందిస్తుంటారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలను వదిలి సేవలందిస్తే ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి రాష్ట్రంలోని సుమారు 6 వేల మందికి న్యాయం చేయాలని మధురిమ విజ్ఞప్తి చేశారు.
పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల ప్రమాద భీమా, ప్రతి ఏడాది యూనిఫామ్ అలవెన్స్ తదితర సమస్యలను పరిష్కరించాలని మధురిమ కోరారు. సమస్యలను విన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రొఫెసర్ కోదండరామ్ లు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారని మధురిమ తెలిపారు.