న్యూఢిల్లీ : స్టాక్‌మార్కెట్‌లో ఫ్యాన్సీగా మారిన అదానీ గ్రూపు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. గ్రూపు ప్రధాన కంపెనీ రూ.20,000 కోట్ల భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) జారీ చేయబోతోంది. శుక్రవారం జరిగే కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఇందుకు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇది దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌పీఓ కానుంది. ఇప్పటి వరకు 2020 జూలైలో ఎస్ బ్యాంకు జారీ చేసిన రూ.15,000 కోట్ల ఎఫ్‌పీఓనే మన దేశంలో అతి పెద్దది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓ ఆ రికార్డును తిరగరాయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా కంపెనీ షేర్లలో సముచిత పాత్ర కల్పించేందుకు ఈ ఎఫ్‌పీఓ దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఎఫ్‌పీఓ జారీ చేయనుంది.