తెలంగాణా ప్రజలకు కేసీయార్ పట్ల అంత వ్యతిరేకతేం లేదని ఎన్నికల్లో అతని ఓటమికి కాంగ్రెస్ గెలుపుకి మధ్య ఓటింగ్ శాతపు తేడా గమనిస్తే తెలుస్తుంది. కేసీయార్ ఓటమికి కింది కారణాలు కారణమని నా అభిప్రాయం.
1.టీయారెస్‌ని బీయారెస్ అని మార్చడం తప్పు. అది ఉద్యమపు వారసత్వం నుండి రాజకీయ పరిధికి మారడం. ఈ విషయంలో కేసీయార్‌కి స్పష్టత వుంది, కానీ ప్రజలకు అది అర్థం కాలేదు, ప్రజల్లో వున్న అభిప్రాయాన్ని అదీ తనకవసరమైనదాన్ని పనిగట్టుకుని చెడగొట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ అవసరం కేసీఆర్ కొనితెచ్చుకున్నది! ఎందుకంటే- తన ప్రాభవాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకోవడం. ఇది తప్పేం కాదు, కానీ రెండు బలమైన జాతీయ స్థాయి ప్రత్యర్థులున్నప్పుడు, తన కాళ్లకింది నేలని కాపాడుకోవడమే ముఖ్యం. బలమైన ప్రాంతీయ సెంటిమెంటు మీద ఆధారపడిన తన ఉనికిని కాదనుకోని పెద్దగా అవకాశాలు లేని కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించలనుకోవడం, విస్తరణవల్ల ఇప్పటికిప్పుడు ఒనగూడే ప్రయోజనాలేవీ లేవని తెలిసినా, కేవలం తనకు వయసయి పోతోందని పరిగెత్తడం వ్యూహాత్మక తప్పిదం.
2.ఓటర్ల సైకాలజీ, ఆ మాటకొస్తే సగటు మనిషి సైకాలజీ అర్థం చేసుకోలేకపోవడం కేసీయార్ తప్పిదం. బాగా పేలిన దళితబంధు, టూ బెడ్రూం ఫ్లాట్ వంటివి అందరికీ చేరలేదు. ఈ విషయంలో పథకం అందుకున్నవాళ్ల సంతోషం కన్నా అది అందనివాళ్ల బాధ ఎక్కువగా వుంటుందని అంచనా వేయలేకపోవడం తప్పు. వీళ్ళు తమదాకా ఆ పథకం వస్తుందనే ఆశని నిలపడంలో ప్రభుత్వం విఫలమైంది.
3.టీయారెస్ తమ ఇంటివిషయం, తమ ఉనికి అనుకున్న సగటు తెలంగాణా పౌరుడిలోని ఉద్యమ ఆవేశం సహజంగానే చల్లారి పోతుందని కేసీయార్ గ్రహించలేదు, మొదటి ఎన్నికలప్పటిలాగా దాన్ని రెచ్చగొట్టలేదు. పైగా తాను దాన్ని స్వచ్చందంగా వదులుకున్నాడు.
4.మంత్రులు, నాయకులు సంపాదనా పరులయ్యారు. ఉద్యమపార్టీ ఫక్తు రాజకీయపార్టీ అయినప్పుడు తన సహజ లక్షణాలైన అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం చేరిపోయాయి. అందాకా భుజం కలిపి వూర్లో నిలబడిన నాయకుడు బంగళాలూ, ఆస్తులు, కాంట్రాక్టులు పోగేసుకోవడం రోజూ చూసే ప్రజలకు ఈర్షాద్వేషాల్ని కలిగించాయి. కావాలంటే ఈ ఈర్షా ద్వేషాలు సిటీలో గాకుండా సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
5.ఇందులో విషయం ఏమంటే కేసీయార్ వీళ్లని తొలగించక పోవడం, వాళ్లకే సీట్లివ్వడం. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకతని వీళ్లమీద మోపి వీళ్లకు సీట్లివ్వకపోయినట్లైతే పరిస్థితి మరోలా వుండేది. ఆంధ్రలో వైసీపీ చేసినట్లు వాళ్ల సీట్లు పరస్పరం మార్చలేదు. దీనికి కారణం ఈ నాయకులని కేసీయార్ అదుపు చేసే శక్తిని దాటి ఎదిగారు కాబట్టి. ప్రాంతీయ పార్టీలకి ఈ పరిస్థితి దుర్బేధ్యమైనది.
6.బాగా చదువుకున్నవారు, మేధావులు ఓటువేయరు, కానీ ఎన్నికల పరిస్థితిని ప్రభావితం చేస్తారు. ప్రగతిశీల ఉద్యమకారుల అరెస్టులు, సోదాలు, వేధింపులు, అణచివేతల విషయంలో ఎన్నో ఆశలతో నిండిన విద్యావంతులని కోపానికి గురిచేశాయి. ధర్నాచౌక్ ఎత్తివేత నుండి పలువిషయాల్లో కేసీయార్ స్వభావసిద్దమైన నిరంకుశత్వాన్ని ముందుకు తెచ్చారు. ఉద్యమకాలపు స్పూర్తి పదేళ్లలో కనుమరుగు అయ్యింది.
7.ఎన్నికల ప్రచారం విషయంలో కేసీయార్ తనదైన మ్యాజిక్ చూపలేదు, అతని మ్యాజిక్ అయిన కీలక విషయం అతను వదిలేసు కున్నాడు, తెలంగాణా ప్రాంతీయత అనే ఆత్మని అతనే స్వయంగా చంపుకున్నాడు. పైగా కాంగ్రెస్ ప్రచారంలో సరికొత్త పోకడని కేసీయార్ గ్రహించలేకపోయాడు. సునీల్ కనుగోలు సామాజిక మాధ్యమాలని ఇంతగా వాడుకుంటాడని, దాన్ని చదువుకున్న న్యూట్రల్ ఓటర్లు షేర్ చేస్తారని వూహించలేదు.
8.కొన్ని అననుకూల పరిస్థితులని వూహించలేకపోవడం, వాటి పట్ల దిద్దుబాటు చర్యలని తీసుకోకపోవడంలో కేసీయార్ వైఫల్యం వుంది. ఉద్యోగాల విషయంలో కేటీయార్, పథకాల విషయంలో హరీష్‌రావు కొంతవరకు సర్దుకున్నా, మేడిగడ్డ కుంగడం దానిమీద కేసీయార్ కనీసం స్పందించకపోవడం, నిజానికి అతడు ఏదైతే గొప్పగా ప్రచారం చేసుకోవాలనుకున్నాడో దాన్ని చేసుకోలేక పోవడమేగాక పూర్తి డిఫెన్సులో పడిపోయాడు.
9.కేటీయార్ అహంకారం, కేసీయార్ దొరతనం, హరీశ్‌రావు చాణక్యం అనేవి ప్రజలు తమ ఉనికికోసం పనికొచ్చాయనుకున్నప్పుడు వాటిని స్వాగతించారు. అవే లక్షణాలు ఒక్కసారి తమలక్ష్యం సాధించుకున్నాక అవసరంలేదనుకున్నారు, పైగా వ్యతిరేకించారు. నిజానికి ఉద్యమ కాలపు ఆశల్ని ఎవరూ తీర్చలేరు. అయితే వాటిని మెల్లగా వాస్తవంలోని నడిపించడంలో వీళ్లు విఫలమయ్యారు.
10.ఓటు కాంగ్రెస్‌కి అనుకూలంగా కాదు, కేసీయార్‌కి వ్యతిరేకంగా పడిందనేది అనేది ముఖ్యంగా అంగీకరించాల్సిన విషయం. గెలవగానే కాంగ్రెస్ పని అయిపోలేదు, హామీలు నెరవేర్చాల్సి వుంది, ముఖ్యంగా తనను తానే పతనం చేసుకునే కాంగ్రెస్‌లో పరిస్థితి సవ్యంగా వుండేది, వుండేలా కేంద్రనాయకత్వం ప్రయత్నించగలిగేది పార్లమెంటు ఎన్నికలవరకే. అంతలోగా తాను చూపిన మార్గంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలలో సగానికి పైగా లాక్కోగలదు. ఇంకా అనేక రకాలుగా పార్టీని బలహీనపరచగలదు. ఇదే అదనుగా మరోవైపు బీజేపీ కూడా బీయారెస్ పార్టీని బలహీనపరిచి తన వాటా లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితినుండి బయటపడడమే ఇప్పుడు కేసీయార్‌కి అసలైన సవాలు. దీన్నుండి బయటపడడంపై అతని కుటుంబం, పార్టీ మనుగడ ఆధారపడి వుంటుంది.